*– కేరళ సహకార బ్యాంకులకు సుప్రీంకోర్టు స్పష్టం
🔹 సహకార బ్యాంకుల రక్షణ కోసం దేవాలయ నిధులు వినియోగించడం అనర్హం
🔹 దేవాలయ డిపాజిట్లను తిరిగి ఇవ్వాలన్న కేరళ హైకోర్టు తీర్పుకు సుప్రీం ముద్ర
🔹 “దేవుడి డబ్బు గుడి అవసరాలకే”— సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యలు
🔹 బ్యాంకుల వైఫల్యాన్ని ఆలయ నిధులతో పూడ్చడం తప్పు: ధర్మాసనం హెచ్చరిక
అక్షర గళం, హైదరాబాద్:
దేవాలయాల సంపద ఎవరిది? ఎలా వినియోగించాలి? అనే అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. దేవాలయాలకు చెందిన ధనం పూర్తిగా దేవునిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆలయ నిధులను సహకార బ్యాంకుల ఆర్థిక సమస్యలు తీర్చేందుకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కేరళలోని సహకార బ్యాంకులు, దేవాలయాల డిపాజిట్లను తిరిగి ఇవ్వాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. ఈ పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, కేరళ హైకోర్టు తీర్పును యథావిధిగా నిలబెట్టింది.
విచారణలో జస్టిస్ సూర్యకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “సహకార బ్యాంకుల్ని కాపాడటం కోసం దేవాలయ డబ్బును వాడతారా? దేవుడి డబ్బు పవిత్రం. అది గుడి అవసరాలకు మాత్రమే వినియోగించాలి. ఆదాయ మార్గంగా మారకూడదు. సహకార బ్యాంకులు మరో మార్గం చూసుకోవాలి” అని ధర్మాసనం పేర్కొంది.
తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా దేవాలయాల నిధుల పరిరక్షణకు స్పష్టమైన మార్గదర్శకాలు లభించినట్లయ్యింది.

