– కోట్ల రూపాయలు విలువచేసే వెయ్యి గజాల స్థలాన్ని రక్షించిన హైడ్రా
అక్షరగళం, శేరిలింగంపల్లి: కోట్ల రూపాయలు విలువచేసే పార్క్ స్థలాన్ని కబ్జాదారుల నుంచి సంరక్షించింది హైడ్రా.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ గ్రామంలో ప్రజల వినియోగానికి కేటాయించిన 1000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా సోమవారం కాపాడింది. సుమారు రూ.13 కోట్ల విలువైన ఈ స్థలం సర్వే నంబర్ 23లో ఉషోదయ ఎన్‌క్లేవ్ పేరుతో హుడా అనుమతులు పొందిన లేఔట్‌లో భాగంగా ఉంది. లేఔట్ అనుమతుల సమయంలోనే ఈ స్థలాన్ని పార్కు కోసం కేటాయించగా, దీనిని జీహెచ్‌ఎంసీకి గిఫ్ట్ డీడ్ ద్వారా కూడా అప్పగించారు. అయితే ప్రజల అవసరాల కోసం ఉండాల్సిన ఈ పార్కు స్థలాన్ని స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి, చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. దీంతో ఉషోదయ ఎన్‌క్లేవ్ నివాసితులు పార్కును కాపాడాలని దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. పార్కుకు కేటాయించబడినట్లు స్పష్టమైన రికార్డులు ఉన్నప్పటికీ, స్థానిక యంత్రాంగం దీనిని పరిరక్షించడంలో విఫలమైంది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైడ్రా రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. పరిశీలనలో ఇది పార్కు స్థలమేనని నిర్ధారణ కావడంతో, సోమవారం అక్రమంగా నిర్మించిన ప్రహరీని కూల్చివేసి, ఆ స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అలాగే ఇది ప్రజావసరాల కోసం కేటాయించిన పార్కు స్థలమని స్పష్టం చేస్తూ హైడ్రా బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.

