_ ‘ఓటు వేయలేదంటే డబ్బులు తిరిగి ఇవ్వండి’ అంటూ అభ్యర్ధన..
_ నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాని గ్రామంలో చర్చనీయంశం..
అక్షరగళం, నల్గొండ : ఓట్లకొసం డబ్బులు పంచినప్పటికి ఓటమి పాలవడంతో ఓ సర్పంచ్ అభ్యర్ధి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమంటూ ఓటర్లను అభ్యర్ధించడం చర్చనీయంశంగా మారింది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాని గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి బాలరాజు, ఎన్నికల సమయంలో గ్రామంలోని పలువురు ఓటర్లకు డబ్బులు పంచినట్లు సమాచారం. అయితే ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి జక్కల పరమేశ్ 450 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించాడు. ఈ ఫలితంతో అవాక్కయిన అభ్యర్థి బాలరాజు చేతిలో దేవుడి ఫొటో పట్టుకొని గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రశ్నించాడు. “మీరు నాకు ఓటు వేస్తే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. ఓటు వేయలేదంటే నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి” అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్రమంలో పలువురు ఓటర్ల నుంచి ఆయన డబ్బులు తిరిగి వసూలు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ అంశంపై బాలరాజు భార్య “50 లేదా 60 ఓట్ల తేడాతో ఓడిపోయి ఉంటే మేం డబ్బులు తిరిగి అడిగేవాళ్లం కాదు. కానీ 450 ఓట్ల భారీ తేడాతో ఓడిపోవడంతోనే డబ్బులు అడగాల్సి వచ్చింది” అని ఓటర్లకు ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఘటన గ్రామంలో రాజకీయ చర్చకు దారి తీసింది. ఎన్నికల్లో డబ్బుల పంపిణీ, అనంతరం వాటి వసూలు అంశాలు మరోసారి ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

