– గ్రేటర్‌లో అక్రిడిటేషన్ నిబంధనలపై జర్నలిస్టుల ఆందోళన
– మండలానికి ఒక్క కార్డు విధానంతో అర్బన్ విలేకరులకు నష్టం
– జీవో–252 సవరణ కోరుతూ మీడియా అకాడమీకి వినతి
– నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చైర్మన్ శ్రీనివాసరెడ్డి హామీ
అక్షరగళం, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. నూతన అక్రిడిటేషన్ నిబంధనల తో కొందరు జర్నలిస్టులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు టియూడబ్ల్యూజే ఐజేయు నాయకులు. అక్రిడిటేషన్‌లకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో–252లోని కొన్ని నిబంధనలు జర్నలిస్టులకు నష్టం కలిగించే అవకాశం ఉందని టీయూడబ్ల్యూజే–ఐజేయు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీయూడబ్ల్యూజే ఐజేయు, హెచ్‌యూజే, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రతినిధుల బృందం ఆదివారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. నూతన జీవోలో మండలానికి ఒక్క అక్రిడిటేషన్ కార్డు మాత్రమే అనే నిబంధన వల్ల గ్రేటర్ పరిధిలోని అర్బన్ మండలాల్లో పనిచేస్తున్న ప్రధాన పత్రికల జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు వివరించారు.
అర్బన్ మండలాల్లో ఒకే పత్రికకు చెందిన ముగ్గురు నుంచి నలుగురు వరకు విలేకరులు విధులు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో, ఒక్క కార్డు విధానం కొనసాగితే మిగిలిన జర్నలిస్టులు అక్రిడిటేషన్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ప్రతినిధులు తెలిపారు. అందుకే గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగిస్తూ, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌లు వచ్చేలా జీవో–252ను సవరించాలని వారు కోరారు.
నిజమైన జర్నలిస్టులకు తప్పకుండా..
ప్రతినిధుల విజ్ఞప్తికి స్పందించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ జిల్లా జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. తమ దృష్టికి వచ్చిన అంశాలను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన మార్పులు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాం నారాయణ, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, హెచ్‌యూజే అధ్యక్షులు శంకర్ గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సలీమ్, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

