ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
-కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి
గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదు.
కోదాడ, అక్షరగళం
కోదాడ మండలంలో 14వ తేదీ జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం వారి కార్యాలయంలో మాట్లాడుతూ… పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను బెదిరించడం, డబ్బు లేదా మద్యం పంపిణీ చేయడం, గుంపులుగా తిరగడం వంటి ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైన చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. కౌంటింగ్ అనంతరం ఎటువంటి ర్యాలీలకు, విజయోత్సవ సంబరాలకు అనుమతి లేదని గెలిచిన ఓడిన అభ్యర్థులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోవాలని తెలిపారు. ఎన్నికల కోడ్ ఈనెల 17 వరకు ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

