– విరాట్ కోహ్లీ పాత ఫామ్‌లోనే.. కొత్త దూకుడు
🔹 సఫారీలపై వరుస సెంచరీలతో కోహ్లీ తిరుగుబాటు
🔹 స్ట్రయిక్ రేట్‌పై విమర్శలకు ఘాటైన సమాధానం
🔹 2027 వరల్డ్‌కప్‌కు ముందు శతకాల శతకం సాధ్యమా?
🔹 84వ శతకం తర్వాత రెట్టింపైన కోహ్లీ ఆత్మవిశ్వాసం
అక్షర గళం, హైదరాబాద్:
దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు వన్డేలలో శతకాలు బాదుతూ విరాట్ కోహ్లీ తన పాత ఫామ్‌ను గుర్తుకు తెచ్చాడు. 37 ఏళ్ల ఈ స్టార్ బ్యాటర్ 135, 102 పరుగులతో చేసిన అద్భుత శతకాలతో మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. తాజాగా అతడి ప్రదర్శన 2016–17లో చూపిన అదిరిపోయే ఫామ్‌ను అభిమానులకు గుర్తు చేస్తోంది.
సెంచరీల ‘సెంచరీ’ సాధ్యం కాదా?
కోహ్లీ ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్‌లో 84 శతకాలు చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన శతకాల శతకం రికార్డును విరాట్ చేరగలడా అనే చర్చ దేశ క్రికెట్ వర్గాల్లో నెలకొంది. స్ట్రయిక్ రేట్‌పై వచ్చిన విమర్శలను తిప్పికొడుతూ సఫారీలపై వేగంగా పరుగులు చేయడం కోహ్లీ ఫామ్‌కు మరిన్ని ప్లస్ పాయింట్లు తెచ్చాయి. 2027 వన్డే వరల్డ్‌కప్ దక్షిణాఫ్రికాలో అక్టోబర్–నవంబర్‌లో జరగనుంది. అప్పటివరకు అతడు సుమారు 25 వన్డేలు ఆడే అవకాశం ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం ఉన్న ఫిట్‌నెస్, ఫామ్ కొనసాగితే శతకాల సంఖ్యను పెంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం అని నిపుణులు భావిస్తున్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాలనే నిర్ణయం
పెద్దగా ఫామ్‌లో లేని సమయంలో వచ్చిన ఈ రెండు శతకాలు కోహ్లీకి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో దేశీయ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. బెంగళూరులో జరగబోయే మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీ ఆడనుండడం క్రికెట్ పండితులను ఆకట్టుకుంది.
శతకాల శతకం – కఠినమైన గమ్యం
కోహ్లీ గత గణాంకాల ప్రకారం ప్రతి 4–6 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌కు ఒక సెంచరీ సాధించేవాడు. అయితే వయస్సు, తక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా ఇది కొంత తగ్గింది. ఇక టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వన్డేలు, ఐపీఎల్ మాత్రమే కోహ్లీకి మిగిలిన వేదికలు.శతకాల శతకం చేరుకోవాలంటే కనీసం 12–16 శతకాలు అవసరం. ఇందుకోసం 50–60 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. కానీ 2027 వరల్డ్‌కప్‌లోకి వెళ్లేలోపు అతడు ఆడే మ్యాచ్‌లు సుమారు 36 మాత్రమే. అందువల్ల శతకాల శతకం సాధించడం కాస్త కష్టంగానే కనిపిస్తున్నప్పటికీ 2016–17 ఫామ్‌ను మరలా అందుకుంటే అవకాశం పూర్తిగా లేకపోలేదని నిపుణులు చెప్పుతున్నారు. వరల్డ్‌కప్ అనంతరం కోహ్లీ రిటైర్ అయ్యే వీలుందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.
