అక్షరగళం , హైదరాబాద్ :ఇవాళ విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక లభించింది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నుంచి వెంకటేశ్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
విడుదల చేసిన పోస్టర్‌లో వెంకటేశ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. హెలికాప్టర్ నుంచి దిగి, గన్‌మన్ల పహారా మధ్య నడిచివస్తున్న ఆయన లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో వెంకీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని, అదే సమయంలో ఆయన మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.
ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేశ్ మధ్య వచ్చే సన్నివేశాలు, వారిద్దరిపై చిత్రీకరించే పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్ధన్ వంటి నటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

