aksharagalam.com

వాసవి నిర్మాణాలు చెరువులో ఉన్నట్టా..? లేనట్టా..?

– ఒకసారి చెరువులోని నిర్మాణాలు అంటారు..

– మరోసారి ఎఫ్డిఎల్ లో లేవు అంటారు

– అధికారుల రిపోర్టులతో గందరగోళం

– మూడు నెలల్లో జాయింట్ సర్వే చేయాలని కోర్టు ఆదేశించిన..

– ఇప్పటికీ సర్వే చేయలేదంటూ ఆరోపణ

– చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి అంటూ..

– హైడ్రా కమిషనర్ కు మరో మారు వినతి పత్రం అందజేసిన

– నిజాంపేట కార్పొరేషన్ బిజెపి మాజీ అధ్యక్షులు ఆకుల సతీష్

అక్షరగళం, నిజాంపేట్: చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణాల ఆరోపణలపై సంబంధిత అధికారులు ఇస్తున్న రిపోర్ట్స్ గందరగోళానికి తెరలేపుతుంది. ఒక అధికారి చెరువు పరిధిలోకి నిర్మాణాలు వస్తున్నాయని రిపోర్ట్ ఇస్తే మరొక సందర్భంలో చెరువు వెలుపలే నిర్మాణాలు వస్తున్నాయని రిపోర్ట్స్ ఇవ్వడంతో అనుమానాలు కు తావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నిజాంపేట సర్కిల్ బాచుపల్లి లో వాసవి అర్బన్ పేరిట నిర్మిస్తున్న టవర్లలో 8, 9 వ బ్లాక్ లో కోమటికుంట ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మిస్తున్నారన్న ఆరోపణలతో కోర్టు ఆదేశాల ప్రకారం జాయింట్ సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ నిజాంపేట్ కార్పొరేషన్ బిజెపి మాజీ అధ్యక్షులు ఆకుల సతీష్ మరోమారు హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

జాయింట్ సర్వే చేయమని చెప్పినప్పటికీ…

కోమటికుంట చెరువు సంబంధించి హైకోర్టులో ఆకుల సతీష్ దాఖలు చేసిన పిటీషన్ నేపథ్యంలో, కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆయన ఆయన హైడ్రా కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ లలో బ్లాక్ నెంబర్లు 8, 9 నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆందోళన,
ఇప్పటికే హైకోర్టు చెరువు పరిరక్షణపై హైడ్రా ఆధ్వర్యంలో ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండిఏ అధికారులు రీ సర్వే చేయాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని అమలు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. చెరువు పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లపై, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, హైకోర్టు ఆదేశాల మేరకు చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, చెరువు పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఈ అంశంపై హైడ్రా అధికారులు వెంటనే స్పందించి, కోమటికుంట చెరువు ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టాలని, భవిష్యత్‌లో ఇలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆకుల సతీష్ సతీష్ లేఖలో విజ్ఞప్తి చేశారు.

చెరువులో “వాసవి అర్బన్”…?

బాచుపల్లి మండలంలోని కోమటి కుంట చెరువు పరిధిలో వాసవి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన భారీ లగ్జరీ అపార్ట్మెంట్ల నిర్మాణం గత మూడు సంవత్సరాలుగా న్యాయ పరమైన వివాదాల ముసుగులోనే కొనసాగుతోంది. “వాసవి అర్బన్” పేరుతో 12 బ్లాకుల్లో, 23 అంతస్తుల చొప్పున చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పై, చెరువు ఎఫ్ టి ఎల్–బఫర్ జోన్ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్మాణాలపై బీజేపీ నేత ఆకుల సతీష్ హైకోర్టును ఆశ్రయించడంతో, చెరువు ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు కలిసి జాయింట్ సర్వే నిర్వహించి, మూడు నెలల్లో నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది.

ఆక్రమణలపై కేసులు… పోలీస్ స్టేషన్ వరకు చేరిన వివాదం

2022లో కోమటి కుంట చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్‌లో బ్లాక్ 8, 9 నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో అప్పటి ఇరిగేషన్ అధికారులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2022 జూన్ 17న వాసవి కన్స్ట్రక్షన్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
అనంతరం 2023 జూలై 4న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పటి కమిషనర్ రామకృష్ణ రావు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మరోసారి కేసులు నమోదయ్యాయి. సర్వే నంబర్లు 126, 137 పరిధిలోని నిర్మాణాలను నిలిపివేయాలని, 24 గంటల్లో స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులు ఇచ్చినా, నిర్మాణాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

హైకోర్టు పరిధిలో…
ఒకవైపు పోలీసు కేసులు… మరోవైపు కోర్టు విచారణలు… ఇలా వాసవి కన్స్ట్రక్షన్స్ వ్యవహారం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది. 2023లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సంస్థకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆకుల సతీష్, 2024లో మరోసారి డబ్ల్యూ పి నం 35954/2024గా హైకోర్టును ఆశ్రయించారు. చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ మ్యాపులు మార్చి రిపోర్టులు ఇచ్చారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు, 2025 జూలైలో కీలక ఆదేశాలు జారీ చేస్తూ, హైడ్రా ఆధ్వర్యంలో ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ ఎం డి ఎ అధికారులతో కలిసి జాయింట్ సర్వే నిర్వహించాలని, అక్రమాలు తేలితే కూల్చివేత చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశించిన ఇంతవరకు జాయింట్ సర్వే జరగలేదని, వాసవి అర్బన్ నిర్మాణాలు మాత్రం చెరువులో కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఆకుల సతీష్ హైడ్రాను శనివారం ఆశ్రయించడంతో వాసవి అర్బన్ చెరువులో అక్రమ నిర్మాణాల ఆరోపణలు మరో మారు తెరపైకి వచ్చాయి. ఈ దపాలు అయినా కోమటికుంట చెరువులో అక్రమ నిర్మాణాల ఆరోపణల వ్యవహారంలో సరైన విధంగా జాయింట్ సర్వే చేసి చెరువులలో చేస్తున్న అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version