aksharagalam.com

టీయూడబ్ల్యూజే హెచ్–143 మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా “కోలా వెంకటేశ్వర్లు”

– ప్రధాన కార్యదర్శిగా కొలెపాక వెంకట్

– నియామక ఉత్తర్వులు అందజేసిన టీయూడబ్ల్యూజే–టీజేఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు

– జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాం

– జీవో–252కు వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి పిలుపు

– నూతన అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు

అక్షరగళం, మేడ్చల్ జిల్లా: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) – తెలంగాణ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీజేఎఫ్) హెచ్–143 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులుగా కోలా వెంకటేశ్వర్లు, కొలిపాక వెంకట్‌లు ఎంపికయ్యారు. కోలా వెంకటేశ్వర్లు (మేడ్చల్ జిల్లా సాక్షి రిపోర్టర్) జిల్లా అధ్యక్షుడిగా, కొలెపాక వెంకట్ (కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నమస్తే తెలంగాణ ఇన్‌చార్జి) ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ మేరకు టీయూడబ్ల్యూజే–టీజేఎఫ్ అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్ నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వెంకటేశ్వర్లు, వెంకట్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో పదవీ బాధ్యతలు అప్పగించిన యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో–252 ద్వారా జర్నలిస్టులను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా జర్నలిస్టులందరినీ ఐక్యం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యూనియన్ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

Exit mobile version