– కృష్ణ–గోదావరి జలాలపై హాట్ డిబేట్…
– 15 రోజుల సమావేశాలపై బీఏసీ నిర్ణయం
హైదరాబాద్, (అక్షర గళం): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. తొలి రోజున ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేయగా, ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. సభలు వాయిదా పడిన అనంతరం జరగనున్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో అసెంబ్లీ, మండలి సమావేశాల వ్యవధిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. ఈ సమావేశాలకు హాజరుకానున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణ–గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టులు ప్రధాన అజెండాగా మారనున్నాయి. ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించిన అంశంపై విస్తృత చర్చ జరగనుంది. ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరుతోంది. ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చిన బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది. మరోవైపు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ నిర్ణయించడంతో అసెంబ్లీ వాతావరణం వేడెక్కనుంది.

