- “రేగుల కుంట” లో రయ్ రయ్ మంటూ కబ్జా
- – సర్వే నంబర్ మాయాజాలంతో అక్రమ కట్టడం
- – 151 చెరువు భూమికి బదులుగా..
- – 150 లో ఉన్నట్లుగా చూపిస్తూ అనుమతులు
- – పరిశీలన చేయకుండానే జిహెచ్ఎంసి శేర్లింగంపల్లి జోనల్ పర్మిషన్
- – గతంలోని ఆ ప్రాంతం చెరువు భూమిగా పేర్కొంటూ రాజేంద్రనగర్ ఆర్డిఓ రిపోర్ట్
- – పరిశీలించి చర్యలు తీసుకుంటాం: హుస్సేన్ సాగర్ లేక్ డివిజన్ అధికారులు

అక్షరగళం, శేరిలింగంపల్లి : అధికారిక సర్వేలో చెరువు భూమిగా తేలింది… ఆ ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలతో చేసుకున్నాయని నివేదికన సైతం రూపొందించారు అధికారులు. అయినప్పటికీ చర్యలు లేకపోవడంతో తప్పుడు ప్లాట్ నెంబర్లు, తప్పుడు సర్వే నెంబర్లను పేర్కొంటూ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవడం… పరిశీలన చేయకుండానే జిహెచ్ఎంసి అధికారులు అనుమతులు విచ్చేయడంతో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట్ సర్వేనెంబర్ 151 లో ఉన్న రేగులకుంట చెరువు, ప్రభుత్వ భూమిలో ప్రస్తుతం మరొక అక్రమ కట్టడం రయ్ రయ్ మంటూ కొనసాగటం ఆందోళన కలిగించే అంశం.
రికార్డులో చెరువు భూమిగా..
శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట్ గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 151 లో 17 ఎకరాల 14 గుట్టల భూమి రేగులకుంట చెరువుగా రికార్డు అయి ఉన్నది. ఇటీవల అధికారులు రూపొందించి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు అందజేసిన రిపోర్టులో సైతం ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. సదరు భూమిని 22 – A (1) (b) గా నమోదు చేసి నిషేధిత జాబితాలో ఉంచారు. అయితే చెరువు పరిధిలో తప్పుడు డాక్యుమెంట్లు, మోసపూరిత సర్వే నంబర్లతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
తప్పుడు సర్వే నెంబర్లతో..
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, హఫీజ్‌పేట్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు: 119 నుండి 126, 128 నుండి 137, 138/1, 138/2, 139 నుండి 150, 152 నుండి 156, 158 అదేవిధంగా చందానగర్ గ్రామ సర్వే నెంబర్ 287 లో ఉన్న భూములలో దీప్తిశ్రీ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఫేజ్ I, ఫేజ్ II, ఫేజ్ III యొక్క సవరించిన తుది లేఅవుట్ ఉన్నది. సర్వే నెంబరు 151 రేగులకుంట చెరువు కి పక్కనే దీప్తి శ్రీనగర్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో ఒకటైన సర్వే నెంబరు 150 పట్టా భూమి ఉన్నది. ఈ పట్టా భూమిని చూపిస్తూ అక్రమ నిర్మాణదారుడు చెరువు భూమి అయిన సర్వేనెంబర్ 151 లో నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. లేఅవుట్ లో లేని భూమిలో లేని ప్లాట్ ను చూపిస్తూ నిర్మాణదారుడు పత్రాలను సృష్టించి అనుమతులు తీసుకొని నిర్మాణ పనులు చేస్తున్నారని తీవ్ర విమర్శలు ఉన్నాయి.
గతంలో ఆర్డీవో రిపోర్టులో సైతం..
దీప్తి శ్రీనగర్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ కు పక్కనే ఉన్న రాగులకుంట చెరువు భూమిలో సైతం ప్లాట్లను సృష్టించి అక్రమ నిర్మాణాలు చేసినట్లుగా గతంలో రాజేంద్రనగర్ ఆర్టీవో నివేదికను రూపొందించారు. మొత్తంగా ఆరు ప్లాట్ లలో 1200 గజాలకు పైగా భూమి సర్వే నెంబర్ 151 రాగులుకుంట చెరువు ప్రాంతంలోకి వస్తుందని స్కెచ్ సైతం రూపొందించారు. అయితే ఆ రిపోర్టు కేవలం పేపర్లకే పరిమితం అవ్వడంతో చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం అక్కడ అక్రమ నిర్మాణం ఏదేచ్ఛగా కొనసాగుతుంది. ఈ విషయంపై ఇప్పటికే స్థానికులు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం తో పాటుగా శేర్లింగంపల్లి జోనల్ కార్యాలయం అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. కాగా సదరు అక్రమ నిర్మాణాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు.
ఈ అక్రమ కబ్జాలు కొనసాగితే, భవిష్యత్తులో వరద ప్రమాదాలు, భూగర్భ జలాల తగ్గుదలతో పాటు కోట్ల రూపాయలు విలువచేసే ప్రజా ఆస్తి పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి, అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువు భూమిని రక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

