*– రెపో రేటును మరోసారి తగ్గించిన ఆర్‌బీఐ
🔸 ఎంపీసీ కీలక నిర్ణయం — రెపో రేటు 5.25%కు డౌన్
🔸 రుణాలు మరింత చౌక — బ్యాంకింగ్ రంగంపై సానుకూల ప్రభావం
🔸 ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిని సమతూకంలో ఉంచే ప్రయత్నం
అక్షర గళం, హైదరాబాద్:
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వాలన్న దృక్పథంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్లో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో రెపో రేటు 5.5 శాతం నుంచి 5.25 శాతానికి చేరింది. మూడు రోజుల పాటు కొనసాగిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ వెల్లడించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ సూచీలు, గ్లోబల్ మార్కెట్ ప్రభావాలు వంటి అంశాలను సమీక్షించిన అనంతరం రెపో రేటు తగ్గింపుకు కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించింది.
రెపో రేటు తగ్గడం వలన సాధారణ ప్రజలకు, ముఖ్యంగా రుణగ్రహీతలకు పెద్ద రిలీఫ్ దొరకనుంది. బ్యాంకులు రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో గృహ నిర్మాణం, విద్య, వాహనాలు, వ్యాపార రుణాలు మరింత చౌకగా లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది వినియోగదారుల ఖర్చులను పెంచి, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఇది వరుసగా రెండోసారి ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించిన సందర్భం. జూన్‌లో జరిగిన ఎంపీసీ సమావేశంలో కూడా రెపో రేటును 6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించారు. ఇప్పుడు తాజా నిర్ణయం ద్వారా రేటు ఇంకా తగ్గి 5.25 శాతానికి చేరడం, ఆర్‌బీఐ యొక్క సడలింపు ద్రవ్య విధానాన్ని స్పష్టంగా చూపిస్తోంది.భవిష్యత్తులో కూడా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని గవర్నర్ మల్హోత్రా పేర్కొన్నారు.
