– ఎస్‌సీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తాం: తెలంగాణ రాష్ట్ర ఎన్ ఎస్ యూ ఐ నాయకుడు గొల్ల జాన్
అక్షరగళం, కుత్బుల్లాపూర్: రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో దళితుల జనాభా దామాషా ప్రకారం ఎస్‌సీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ నాయకుడు గొల్ల జాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జీడిమెట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నరసింహకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా చేపట్టిన డెలిమిటేషన్ ప్రకారం మొత్తం 300 వార్డులు ఏర్పాటు కాగా, అందులో కుత్బుల్లాపూర్ని యోజకవర్గానికి 30 వార్డులు కేటాయించారని తెలిపారు. అయితే గతంలోనూ, ప్రస్తుతం కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎస్‌సీ రిజర్వేషన్లు సరైన విధంగా అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. ఈ నియోజకవర్గంలో దళితుల జనాభా సుమారు 20 శాతం ఉన్నప్పటికీ, వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం కనీసం 8 వార్డులను ఎస్‌సీకి రిజర్వ్ చేయాలని, అదేవిధంగా జనరల్ వార్డులలో ఒక స్థానాన్ని కూడా దళిత అభ్యర్థికి కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలకు మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఇది దళిత వర్గాలకు రాజకీయ భాగస్వామ్యం కల్పించేందుకు అత్యంత అవసరమని స్పష్టం చేశారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు దళిత ఉద్యమకారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, తమ పార్టీల్లో ఉన్న దళిత నాయకులకు తప్పనిసరిగా టికెట్లు కేటాయించాలని గొల్ల జాన్ డిమాండ్ చేశారు. ఎస్‌సీ రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు.

