– అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ మోసాలను ఎండగడతాం
– రెండేళ్ల కాంగ్రెస్ పాలన – మోసాల పరంపర
– పాలమూరు ప్రాజెక్ట్ పనులు నిలిపేసిన ఘనత కాంగ్రెస్‌దే
– ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తాం
– రైతు భరోసా, పంటల బోనస్ పేరుతో రైతుల నమ్మకద్రోహం
– బిఆర్ఎస్ ఎల్పీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే విప్ కె.పి.వివేకానంద్
అక్షరగళం, కుత్బుల్లాపూర్: నేటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత పాలనకు గట్టి చెక్ పెట్టేందుకు బిఆర్ఎస్ సిద్ధమైంది. గత రెండేళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగానే ప్రజల ముందుకు తీసుకువస్తామని బిఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గారు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై సమాధానాలు ఇవ్వకుండా మాటల మాయలో పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని సభలో నిలదీయక తప్పదని ఆయన హెచ్చరించారు. కొంపల్లి లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో చేపట్టగా, పదేళ్ల బిఆర్ఎస్ పాలనలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గత రెండేళ్లుగా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని తీవ్ర విమర్శలు చేశారు.
గ్యారంటీలు.. డిక్లరేషన్లు.. హామీల ఊసేది..?
వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కచ్చితంగా నిలదీస్తామని కేపీ వివేకానంద స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మృతులు, రైతులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై కూడా స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. రైతుబంధును రైతు భరోసాగా మార్చి పదివేలకు బదులు 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను రెండుసార్లు ఎగ్గొట్టిందని ఆరోపించారు. వరి ధాన్యంతో పాటు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి చివరకు బోగస్ మాటలతోనే పాలన సాగిస్తోందని మండిపడ్డారు.
పదిమంది ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సభ ద్వారానే ప్రశ్నిస్తామని, 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కూడా అసెంబ్లీ వేదికగానే ఎండగడతామని స్పష్టం చేశారు.
కులంకుశాంగా చర్చ జరగాలి
అలాగే బిఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచులకు నిధులు ఇవ్వమని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అహంకారంగా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ఆయన అన్నారు. జిహెచ్ఎంసీలో 22 మున్సిపాలిటీలను అశాస్త్రీయంగా విలీనం చేసిన ప్రభుత్వ విఫలయత్నంపై కూడా సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
ఊకదంపుడు ప్రసంగాలు కాదు, ప్రజా సమస్యలపై స్పష్టమైన సమాధానాలు కావాలని, ప్రతిపక్షాల మైకులు కట్ చేయకుండా స్వేచ్ఛాయుత చర్చ జరిగితేనే ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలుస్తాయని కె.పి.వివేకానంద్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలుపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు బిఆర్ఎస్ సిద్ధంగా ఉందని తేల్చిచెప్పారు. రెండు మూడు రోజులు సమావేశాలు జరపడం కాదని ప్రతి అంశంపై వివరణాత్మకంగా కులంకుసంగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

