– విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
అక్షర గళం, అమరావతి:
రాష్ట్ర విద్యా రంగంలో సమగ్ర మార్పులు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మన్యం జిల్లా బామినిలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త పేరెంట్–టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న లోకేశ్ పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర అపారమని పేర్కొన్నారు. తల్లి ప్రేమ, తండ్రి త్యాగం ప్రతి విద్యార్థి జీవితంలో అమూల్యమైనవని పేర్కొన్న ఆయన మహిళలకు గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలను కూడా అలవరచుకోవాలన్నారు.
పిల్లలు అంటే ఇష్టం.. అందుకే..
విద్యాశాఖను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నకు లోకేశ్ స్పందిస్తూ, “పిల్లలు అంటే నాకు ప్రాణం. అందుకే సీఎం చంద్రబాబును అడిగి ఈ శాఖను తీసుకున్నాను” అని చెప్పారు. పేరెంట్ మీటింగ్స్‌కు తనకు భయం ఉండేదని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి విద్యార్థి దశను, రచయిత కారా మాస్టరు (కాళీపట్నం రామారావు) సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను చదువుకున్న సమయంలో తన తల్లిదండ్రులు ఒకసారి కూడా పేరెంట్స్ మీటింగ్‌కు హాజరుకాలేదని గుర్తుచేసుకున్నారు.
కీలకమైన సంస్కరణలు చేపట్టాం..
అంతకుముందు ఆయన ఇంతవరకు రాష్ట్రంలో తీసుకున్న విద్యా సంస్కరణలను వివరించారు. రాష్ట్రంలో 906 పాఠశాలల్లో కీలక సంస్కరణలు చేపట్టామని,పాఠ్యపుస్తకాలపై మహిళలను ఇంటి పని చేస్తున్నట్లు చూపించే ప్రతిరూపాలను తొలగించామనీ,
ఉపాధ్యాయుల బదిలీలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, లీప్ యాప్ ద్వారా విద్యార్థుల హాజరు, ప్రగతి, పనితీరును తల్లిదండ్రులు ఇంటి నుంచే తెలుసుకునే సౌకర్యం కల్పించామని తెలిపారు.
విద్యా రంగంలో పూర్తిస్థాయి అభివృద్ధి తమ లక్ష్యమని పేర్కొన్న లోకేశ్, 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లడం తమ స్పష్టమైన ధ్యేయమని స్పష్టం చేశారు.
