రేపే మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్
- ఫట్‌బాల్ దిగ్గజంలియోనెల్ మెస్సీ…మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- అందరి చూపు…మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ వైపు…
- ఫుట్‌బాల్ అభిమానుల్లో… మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పెరుగుతోన్న క్రేజ్
- ఆసక్తికరమైన ఆటకు వేదికగా నిలువనున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం
ఇప్పుడు అందరి చూపు ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 13న జరగనున్న మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పైనే ఉంది. అంతగా అందరినీ ఆకట్టకునేందుకు కారణం ఏంటి అనే ప్రశ్న కూడా కొందరిలో ఉదయిస్తోంది.
అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెట్ మెస్సీతో జరగనున్న ఈ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోటీ పడనున్నారు. దీంతో ఈ మ్యాచ్‌కు ఎక్కడలేని ప్రచారం లభించింది.
ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సింగరేణి జట్టు తరపున సీఎం రేవంత్ రెడ్డి ఆడనున్నారు. అపర్ణ జట్టు నుంచి లియోనెల్ మెస్సీ ఆడి ఫుట్‌బాల్ అభిమానులను ఆకట్టుకోనున్నారు. ఒకవైపు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ…మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మ్యాచ్‌లో ఆడనుండటంతో…ఫుట్‌బాల్ అభిమానుల్లో మరింత క్రేజ్ పెరిగింది.
ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరింత ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.
ఈ మ్యాచ్ గురించి సీఎం రెడ్డి మాట్లాడుతూ…
ప్రపంచ దిగ్గజ ఆడగాడు లియోనెట్ మెస్సీతో తలపడటం అంటే మాటలు కాదు…ఫుట్‌బాల్ ఆట అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తెలంగాణ టీంకు లీడర్‌గా నాలుగు కోట్ల మందిని గెలిపించాల్సిన బాధ్యత నాదేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ కంకోల్‌లో ఉన్న వోక్సన్ యూనివర్సిటీకి ఈ మధ్య వెళ్ళినప్పుడు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశానని రేవంత్ అన్నారు. ఫట్‌బాల్ ఆటలో టీం స్పిరిట్ ఉంటుందని తెలిపారు.
అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ…
ది గోట్ ఇండియా టూర్-2025లో భాగంగా అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ వస్తున్నారు. ఈ టూర్ వివరాలను ప్రమోటర్ పార్వతి రెడ్డి తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో…సింగరేణి ఆర్‌ఆర్-9, అపర్ణ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఉంటుందన్నారు. అపర్ణ జట్టు తరఫున మెస్సీ ఆడుతుండగా…సింగరేణి జట్టు తరఫున రేవంత్ రెడ్డి ఆడనున్నారు.
డిసెంబర్ 13న రాత్రి ఏడు గంటలకు మొదలయ్యే మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కేవలం 20 నిమిషాలు ఉంటుంది. చివరి 5 నిమిషాలు సీఎం రేవంత్, మెస్సీలు బరిలోకి దిగుతారు. మ్యాచ్ తర్వాత రెండు జట్లకు ది గోట్ కప్‌ను అందించనున్నట్టు పార్వతి రెడ్డి తెలిపారు. అర్జెంటినాకు చెందిన రొడ్రిగో డి పాల్, ఉరుగ్వేకు చెందిన లూయీస్ సువారెజ్ మ్యాచ్‌కు వస్తన్నట్టు తెలిపారు.
డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో టికెట్లు…
ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నేరుగా చూడాలనుకునే వారి కోసం డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉంచామని పార్వతిరెడ్డి తెలిపారు. టికెట్ ధరలు రూ.1,300 నుంచి ఉన్నాయని…కార్పొరేట్ బాక్స్ టికట్ ధర రూ. 22 వేల నుంచి మొదలవుతుందని తెలిపారు. ఆఫ్‌లైన్‌లో టికట్లు లేవని…కేవలం ఆన్‌లైన్‌లోనే టికెట్లు కొనుగోలు చెయ్యవచ్చని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌ను సోనీ లైవ్ ద్వారా స్ట్రీమింగ్‌లో కూడా చూడవచ్చు.
అలరించనున్న సంగీతం…
ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భాగంగా
సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ నేతృత్వంలో స్టేడియంలో సంగీత విభావరి ఉంటుందని పార్వతిరెడ్డి తెలిపారు. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ప్రముఖ క్రికెటర్లతో పాటు, పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరవుతారని పార్వతి రెడ్డి చెప్పారు. టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్‌ను మ్యాచ్‌కు ఆహ్వానించామన్నారు.
అయితే…ఈ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, పాస్‌లు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.
మొత్తానికి మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌తో ప్రపంచమంతా తెలంగాణలోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వైపు ఆసక్తిగా చూస్తోందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజమైన మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలా ఆడనున్నారోనని ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
