Kadthal:కడ్తాల్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కంబాల పరమేష్
Kadthal:తెలంగాణ తల్లి విగ్రహాం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించటం యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరచడమే అని కడ్తాల్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కంబాల పరమేష్ అన్నారు. ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు.
రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహాం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టటంపై కంబాల పరమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పిలుపు మేరకు మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో డిసిసిబి డైరెక్టర్ వెంకటేష్ గుప్తా,స్థానిక మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి, మరియు ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహనికి పాలభిషేక కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. మొత్తం తెలంగాణ సమాజమంతా తెలంగాణ తల్లి విగ్రహాం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటమేమిటంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పరమేష్ తెలిపారు. వెంటనే రేవంత్ రెడ్డి తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని, లేదంటే కచ్చితంగా తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని హెచ్చరించారు.
తెలంగాణ తల్లి విగ్రహాం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తెలంగాణ సచివాలయం, అమర జ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాం ఉండాలని కేసీఆర్ 2023 జులైలోనే ఈ స్థలాన్ని ఎంపిక చేశారని గుర్తు చేశారు.
యావత్తు తెలంగాణ సమాజం కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగర్వంగా గౌరవించుకునేందుకు కేసీఆర్ ఎంపిక చేసిన స్థలానికి ఆమోదముద్ర వేసిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేయడం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమే అని అన్నారు.
కాంగ్రెస్ చర్య ప్రతి తెలంగాణ వ్యక్తి మనసును గాయపర్చేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంగళపల్లి నరసింహ, లాయకలి,లక్ష్మణ చారి, రామకృష్ణ,రమేష్,అంజి, మహేష్, శ్రీకాంత్, రవి, అబ్బు రమేష్ తదితరులు పాల్గొన్నారు.