– సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్
అక్షర గళం, జగద్గిరిగుట్ట: ఎన్నికల సమయాలలో వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పాలకులు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పనిచేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ డిమాండ్ చేశారు. హెచ్‌ఎమ్‌టీ ఖాళీ స్థలంలో బస్సు డిపోతో పాటు ప్రభుత్వ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జగతగిరిగుట్ట సిపిఐ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పాల్గొని మాట్లాడారు. ఈ రిలే నిరాహార దీక్షను సిపిఐ రాష్ట్ర సభ్యులు ఏసురత్నం, ఇమామ్‌లకు దండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అప్పటి టీఆర్‌ఎస్, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు—ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఎన్నికల సమయంలో హెచ్‌ఎమ్‌టీ ఖాళీ స్థలంలో బస్సు డిపో, ఆసుపత్రి నిర్మిస్తామని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఆ హామీలను సాధించుకోవడం కోసం సిపిఐ పక్షాన అనేకసార్లు ధర్నాలు, నిరాహార దీక్షలు నిర్వహించామని, మంత్రులను కలిశామని తెలిపారు. ఆసుపత్రి కోసం 25 ఎకరాల భూమిని సాధించుకున్నప్పటికీ, ఆ సాధనను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి, సిపిఐతో కలిసి ఉద్యమాల్లో పాల్గొని హామీలు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి స్వామి, సహాయ కార్యదర్శులు హరినాథ్, రాములు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, శాఖ కార్యదర్శి సహాదేవ్ రెడ్డి, యువజన సంఘం అధ్యక్షులు సంతోష్, ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ చారీ, సిపిఐ నాయకులు నగేష్ చారీ, బాబు, నారాయణ మేస్త్రి, నర్సయ్య, మహముద్ తదితరులు పాల్గొన్నారు.
