– తెలంగాణ పోలీసు విభాగంలో కీలక బదిలీలు
– కొత్తగా ఏర్పాటుైన కమిషనరేట్లకు ఐపీఎస్ అధికారుల నియామకం
అక్షరగళం, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగంలో ప్రభుత్వం కీలక బదిలీలు, నియామకాలు చేపట్టింది. పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలువురు ఐపీఎస్ అధికారులను కొత్త బాధ్యతలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత రాచకొండ పోలీస్ కమిషనర్‌గా ఉన్న జి. సుధీర్ బాబు, ఐపీఎస్ (2001 బ్యాచ్) ను కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా బదిలీ చేసి నియమించారు. ఇప్పటివరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న అవినాష్ మోహంతీ, ఐపీఎస్ (2005 బ్యాచ్) ను రాచకొండ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా నియమించారు.
అదే విధంగా, తెలంగాణ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఐజీపీగా, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ హెచ్ఎఫ్ఏసీగా, టీజీపీఐసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఐజీపీ (స్పోర్ట్స్)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ (2005 బ్యాచ్) ను పునర్వ్యవస్థీకరించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా నియమించారు. ఈ స్థానంలో నుంచి అవినాష్ మోహంతీ బదిలీ అయ్యారు.
రాచకొండ పరిధిలో యాదాద్రి భువనగిరి డీసీపీగా పనిచేస్తున్న అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ (2019 బ్యాచ్) ను కొత్తగా ఏర్పాటైన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.

