ఐపీఎల్ 2025 మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 31న ఆక్షన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలతో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది బీసీసీఐ. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ మెగా వేలం నియమావళిలో కొన్ని మార్పులు చేయాలని ఫ్రాంఛైజీలు బోర్డును అభ్యర్ధించాయి. వాటిల్లో ఎక్కువ మంది ఫ్రాంచైజీల ఓనర్లు 3 బిగ్ డిమాండ్‌లు క్రికెట్ బోర్డు ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ఐదేళ్లకు ఒకసారి ఐపీఎల్ మెగా వేలం నిర్వహించాలని చాలామంది ఫ్రాంచైజీల ఓనర్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రతి మూడేళ్లకోసారి మెగా వేలం నిర్వహించేవారు. ఈ నిబంధనను మార్చి.. ఐదేళ్లకొకసారి మెగా వేలం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి ఫ్రాంచైజీలు. అంటే ఈసారి మెగా వేలం నిర్వహిస్తే తదుపరి మెగా వేలం 2029లో జరగాలి. మధ్యలో మినీ వేలం మాత్రమే నిర్వహించాలని వారు అంటున్నారు. మెగా వేలానికి ముందు 4 నుంచి 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించాలని ఫ్రాంచైజీలు అభ్యర్థించాయి. మునుపటి మెగా వేలంలో గరిష్టంగా 4 మంది ఆటగాళ్లను ఉంచుకునే అవకాశం ఉంది. అయితే ఈసారి ఆ సంఖ్యను 4 నుంచి 6కి పెంచాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి.