ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రత కోసం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు సూచనలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటించాలని తెలిపింది.
ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ‘ఇజ్రాయిల్‌లో ప్రస్తుత యుద్ద వాతావరణం దృష్ట్యా ఆ దేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారుల సలహా మేరకు జాగ్రత్తలు పాటించాలి.
దయచేసి జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. సెఫ్టీ షెల్టర్స్‌ల వద్దకు వెళ్లండి. అదనపు సమాచారం కోసం ఇజ్రాయిల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ వెబ్‌సైట్ లేదా వారి బ్రోచర్‌ను చూడండి’ అని తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రవాసులు డియన్ ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్ +97235226748 లేదా cons1.telaviv@mea.gov.in ఇమెయిల్ ద్వారా సంప్రదించాలని ఇజ్రాయిల్‌లోని భారత పౌరులను తెలిపారు. ఎలాంటి సహాయమైనా అందించేందుకు ఎంబసీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.
కాగా, శనివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి ఐదు వేల రాకెట్లు ప్రయోగించారు. ఇజ్రాయిల్‌లో ప్రజలు పదుల సంఖ్యలో మరణించగా వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ఎయిర్ ఢిఫెన్స్ ద్వారా హమాస్ క్షిపణులను ఎదుర్కొన్నది. అలాగే హమాస్‌పై యుద్ధాన్ని ప్రకటించడంతోపాటు ఎదురుదాడి కోసం ఆపరేషన్ ఐరాన్ స్వార్డ్స్ చేపట్టింది.