🔸 టెర్రరిజం వ్యతిరేక పోరాటంలో భారత్‌కు పూర్తి మద్దతు – రష్యా భరోసా
🔸 హైదరాబాద్ హౌస్‌లో మోదీ–పుతిన్ శిఖరాగ్ర భేటీ
🔸 64 బిలియన్ డాలర్ల వ్యాపారం… ట్రేడ్ విస్తరణపై రెండు దేశాల దృష్టి
🔸 కొడంకుళం అణుశక్తి ప్రాజెక్టుకు రష్యా నుంచి కీలక సహాయం
🔸 ఇంధన రంగంలో నిరంతర సరఫరాకు పుతిన్ హామీ
అక్షర గళం, హైదరాబాద్:
టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న గ్లోబల్ పోరాటంలో భారత్‌తో చేతులు కలుపుతూ ముందుకు సాగుతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. టెర్రరిజాన్ని పూర్తిగా నిర్మూలించే దిశలో భారత్‌కు రష్యా సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన ధృవీకరించారు. శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేందర్ మోదీ, పుతిన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. సమావేశం అనంతరం పుతిన్ మాట్లాడుతూ, “ప్రధాని మోదీతో అత్యంత నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. భారత్ ఆతిథ్యం మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. విభిన్న అంశాలపై ఇరుదేశాలు లోతైన చర్చలు జరిపి అనేక విషయాల్లో అవగాహనకు వచ్చాయి” అని అన్నారు.
వాణిజ్యంపై మాట్లాడుతూ, “భారత్–రష్యా మధ్య 64 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం జరిగింది. ఇంతకంటే ఎక్కువ స్థాయిలో ట్రేడ్‌ను విస్తరించేందుకు రెండు దేశాలు కృషి చేస్తున్నాయి. ఆయిల్ సహా అన్ని రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుంది. సాంకేతిక, ఉమ్మడి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం మరింత పెరుగుతోంది” అని పుతిన్ వెల్లడించారు.
సొంత కరెన్సీల్లో వాణిజ్యం జరగడం రెండు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు. కొడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు రష్యా పూర్తిగా సహకరిస్తుందని, విద్యుత్ రంగంలో ఖర్చులను తగ్గించేందుకు కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పారు. భారత్‌కు నిరంతర ఇంధన సరఫరాకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ స్పష్టం చేశారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో భారత్–రష్యా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి.
