– కేపీహెచ్బీలో ఘనంగా ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ సదస్సు
– గ్రామీణ వైద్య సేవల విస్తరణపై ఫౌండేషన్ కీలక ప్రకటనలు
– సేవా దృక్పథానికి డాక్టర్ దామోదర్ నెరెల్లాకు ఘన సత్కారం
అక్షరగళం, కూకట్ పల్లి: సేవే లక్ష్యంగా, మానవత్వమే మార్గంగా వైద్య సేవలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వార్షిక సదస్సు హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఇతిహాస్ బ్యాంక్వెట్ హాల్స్ వేదికగా ఆదివారం ఘనంగా జరిగింది. దేశ, విదేశాల్లో వైద్య సేవల విస్తరణే లక్ష్యంగా సాగుతున్న ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వార్షిక సదస్సు కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక అతిథులుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల నరహరి, బీసీసీఐ సభ్యుడు, డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు సురేందర్ అగర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐ ఎ ఎం ఎ, డి ఆర్ ఆర్ కేర్ స్థాపకుడు, సీఈవో డాక్టర్ దామోదర్ నెరెల్లా ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు.
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్
గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, ఫ్రీ హెల్త్ క్యాంపులు, టెలీ మెడిసిన్ సేవలు, అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు దామోదర్ నేరెళ్ల తెలిపారు. వైద్యం అంటే వ్యాధి వచ్చిన తర్వాత చేసే చికిత్స మాత్రమే కాదని, వ్యాధి రాకుండా ముందే నివారించడమే నిజమైన వైద్యం అని పేర్కొన్నారు. “ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్” సిద్ధాంతంతో ముందస్తు స్కానింగ్ పరీక్షల ద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి అనేక ప్రాణాలను కాపాడుతున్నామని తెలిపారు. ఈ ఉద్దేశంతోనే గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. చెట్లపై నుంచి పడి ప్రాణాలు కోల్పోతున్న గీత కార్మికుల కుటుంబాలకు ఫౌండేషన్ అండగా నిలుస్తోందని, రక్త పరీక్షలు, మందులు, అవసరమైతే సర్జరీలు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్‌లు ప్రారంభించాలనే ఆలోచన ఉందని, అందుకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు. డాక్టర్ కావాలనే తల్లి కోరిక తన జీవితానికి దిశానిర్దేశం చేసిందని, తన తల్లి లాగా మరో తల్లి క్యాన్సర్‌తో మరణించకూడదనే సంకల్పంతో ఈ సేవా ప్రయాణం కొనసాగిస్తున్నానని డాక్టర్ దామోదర్ నెరెల్లా భావోద్వేగంగా తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ దామోదర్ నెరెల్లా సేవలను ప్రత్యేకంగా అభినందించారు. దేశ, విదేశాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని, స్వగ్రామంపై ప్రేమతో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న తీరును ప్రశంసించారు. కార్యక్రమం ముగింపులో డాక్టర్ దామోదర్ నెరెల్లా సేవలను గుర్తించి ఘనంగా సత్కరించారు. సేవే లక్ష్యంగా, మానవత్వమే మార్గంగా ఐ ఎ ఎం ఎ ఫౌండేషన్ మరెన్నో ప్రాణాలను కాపాడాలని అతిథులు ఆకాంక్షించారు.

