– ప్రజా భవన్‌లో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుల సమావేశంలో మంత్రి సీతక్క
అక్షర గళం, హైదరాబాద్: నూతన సంవత్సరంలో మహిళా స్వయం సహాయక బృందాలు నూతన లక్ష్యంతో, మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిష్ సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క దిశానిర్దేశం చేశారు. సోమవారం ప్రజా భవన్‌లో నిర్వహించిన జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుల సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిష్ సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సార్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ తో కలిసి జిల్లాల వారిగా గత నెల రోజులపాటు మహిళా సంఘాలు, సమాఖ్యలు నిర్వహించిన కార్యకలాపాలను మంత్రి సీతక్క సమీక్షించారు.ఈ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇప్పటివరకు మహిళా సంఘాలు తమను తాము అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాయని, ఇకపై వారి బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. కేరళ తరహాలో అత్యంత పేదరికంలో ఉన్న వారిని గుర్తించడంలో గ్రామైక్య సంఘాలు కీలక పాత్ర పోషించాలని మంత్రి సూచించారు. అత్యంత పేదరికంలో ఉన్న “పూరెస్ట్ ఆఫ్ ద పూర్”ను టార్గెట్‌గా గుర్తించి, వారిని ఆ స్థితి నుంచి బయటకు తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో అత్యంత వెనుక బాటలో ఉన్న కుటుంబాలను గుర్తించి, వారి అవసరాలను అర్థం చేసుకొని ప్రభుత్వానికి నివేదిస్తే..టార్గెట్‌గా వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు ఇప్పటివరకు అందని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సహాయం చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘మీ పరిసరాల్లో, మీ గ్రామాల్లో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి, వారికి ఏ అవసరాలు ఉన్నాయో తెలియజేస్తే ప్రభుత్వం తప్పకుండా వారిని ఆదుకుంటుంది’ అని తెలిపారు.
అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించేందుకోసం అవసరమైన ప్రొఫార్మాను త్వరలోనే అందజేస్తామని చెప్పారు.ఈ సందర్భంగా కేరళలో అత్యంత పేదరికానీ నిర్మూలన ఎలా చేపట్టారో మహిళా సంఘాలకు మంత్రి సీతక్క వివరించారు. అక్కడ సర్వే ద్వారా 64,006 అత్యంత పేద కుటుంబాల్లో సుమారు లక్ష మంది తీవ్రమైన పేదరికంలో ఉన్నవారిగా గుర్తించారని చెప్పారు.ఆహారం, ఆరోగ్యం, జీవనోపాధి, గృహ నిర్మాణం వంటి అంశాలను ఆధారంగా తీసుకొని బతుకు కష్టంగా ఉన్న కుటుంబాలను అత్యంత పేదలుగా గుర్తించి, ప్రతి కుటుంబానికి వేర్వేరు అవసరాలున్నాయని, అందు కోసం ప్రత్యేక మైక్రో ప్లాన్‌లను రూపొందించారని, అదేవిధంగా తెలంగాణలో కూడా అత్యంత పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మైక్రో ప్లాన్ ను రూపొందిస్తామని చెప్పారు.ఆయా కుటుంబాలకు కేరళా తరహాలో గుర్తింపు కార్డులు, ఇళ్లు, ఉపాధి అవకాశాలు, వైద్య సంరక్షణ వంటి సహాయాలను అందిస్తామని తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చొరవతో అన్ని ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను సమీకరించి ఈ లక్ష్యాన్ని కేరళ సాధించిందని.. అదే తరహాలో తెలంగాణలో మహిళా సంఘాలు ముందుకు వచ్చి అత్యంత పేదరిక నిర్మూలనలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా ఎన్నికైన సూర్యాపేట, వనపర్తి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరిత, స్వరూపలను మంత్రి సీతక్క సన్మానించారు.మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్న సార్ప్ ను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి మహిళా సంఘ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
