– ఇంటి ముందు ఖాళీ స్థలమే కాదు… రోడ్లను కూడా వదలని ఆక్రమణదారులు
– డెడ్ ఎండ్ రోడ్లను పూర్తిగా మూసేస్తూ ప్రజలకు రహదారి లేకుండా అడ్డంకులు
– అధికార యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తూ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు
– ఒక్కరోజే హైడ్రా ప్రజావాణికి 44 ఫిర్యాదులు
– ఫిర్యాదులను నేరుగా స్వీకరించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
అక్షర గళం, హైదరాబాద్: ప్రజలకు ఇబ్బందులు కలిగించే అక్రమ నిర్మాణాల పై చర్యలు, ప్రభుత్వ భూముల సంరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్ట చేశారు. హైడ్రా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ అంశాలపై వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా పరిశీలించారు. నగరంలో ఆక్రమణలు రోజురోజుకూ హద్దులు దాటుతున్నాయని, ఇంటి ముందు ఖాళీ స్థలం మాత్రమే కాకుండా, ప్రజలకు ఉపయోగపడాల్సిన రహదారులను కూడా వదలకుండా కొందరు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారనీ, ముఖ్యంగా డెడ్ ఎండ్ రోడ్లను పూర్తిగా ఆక్రమించి, ఎదుటివారికి కనీస రహదారి కూడా లేకుండా నిర్మాణాలు చేపడుతున్న తీరుపై ఫిర్యాదుదారులు కమిషనర్ కు వివరించారు. ఈ అక్రమాలపై నిఘా పెట్టాల్సిన వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఆక్రమణలు జరుగుతున్నాయని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వివిధ శాఖల వద్ద చేసిన ఫిర్యాదులకు స్పందన లేకపోవడంతో, ఆధారాలతో సహా హైడ్రా ప్రజావాణికి వచ్చి తమ గోడును వెళ్లబుచ్చుకుంటున్నారు. సోమవారం ఒక్కరోజే హైడ్రా ప్రజావాణికి మొత్తం 44 ఫిర్యాదులు అందాయి.
ప్రజావాణిలో వచ్చిన కొన్ని ఫిర్యాదులు సారాంశం
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం వనస్థలిపురం సాహేబ్‌నగర్‌లోని శ్రీ వీరాంజనేయ కాలనీలో 18 అడుగుల రహదారిని ప్లాట్ల యజమానులు కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. రోడ్డుపక్కన ఉన్న కరెంటు స్తంభాలను కూడా కలుపుకొని ఫెన్సింగ్ వేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.
శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని శ్రీ రాంనగర్ కాలనీలో సర్వే నంబర్ 202లో రియల్ ఎస్టేట్ సంస్థ 1.20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి, స్థానికుల ఇళ్లకు వెళ్లే దారిని మూసివేసిందని ఫిర్యాదు చేశారు.
సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ మచ్చబొల్లారంలోని సూర్యనగర్ బస్‌స్టాప్ వద్ద 30 అడుగుల రోడ్డును 7 అడుగుల వరకు కబ్జా చేయడంతో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని బాలాజీ ఎన్‌క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
మహేశ్వరం మండలం శ్రీనగర్ గ్రామంలో సర్వే నంబర్లు 249, 248లలో ఉన్న కచ్చా రహదారిని మూసివేసి దారి అడ్డుకున్నారని, దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న మార్గాన్ని ఇలా బ్లాక్ చేయడం అన్యాయమని స్థానికులు ఫిర్యాదు చేశారు.
అలాగే రాజేంద్రనగర్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఇన్నర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని పీఎంఆర్ అపార్ట్‌మెంట్ వద్ద రహదారులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణికి తెలిపారు.
