aksharagalam.com

అందుబాటులోకి వచ్చిన గూగుల్ కీలక సర్వీస్

– నియోగదారుల కోసం అత్యంత కీలకమైన ‘ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్’.

– ఆండ్రాయిడ్ ఫోన్లలో అంతర్నిర్మితంగా పనిచేసే న్యూ ఫ్యూచర్స్ .

– 50 మీటర్ల కచ్చితత్వంతో బాధితులు ఎక్కడున్నారో గుర్తించడం సాధ్యమవుతుంది.

అక్షరగళం , మంగళవారం టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అత్యంత కీలకమైన ‘ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్’ (ELS)ను ప్రారంభించింది. ఈ అధునాతన టెక్నాలజీని తమ 112 అత్యవసర సేవలతో పూర్తిస్థాయిలో అనుసంధానం చేసుకున్న తొలి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఈ విషయాన్ని గూగుల్ ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది.ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో అంతర్నిర్మితంగా పనిచేస్తుంది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు కాల్ చేసినా లేదా SMS పంపినా, వారి కచ్చితమైన లొకేషన్ ఆటోమేటిక్‌గా సహాయక బృందాలకు చేరుతుంది. ఇందుకోసం ఫోన్‌లోని జీపీఎస్, వై-ఫై, మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్‌ను ఉపయోగించుకుంటుంది. దీనివల్ల దాదాపు 50 మీటర్ల కచ్చితత్వంతో బాధితులు ఎక్కడున్నారో గుర్తించడం సాధ్యమవుతుంది.ముఖ్యంగా, ఆపదలో ఉన్నవారు కాల్ చేసిన కొద్ది క్షణాలకే కనెక్షన్ కట్ అయినా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. వారి లొకేషన్ వివరాలు అప్పటికే ఎమర్జెన్సీ కేంద్రానికి చేరిపోతాయి. దీంతో సహాయక బృందాలు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకోవచ్చు. వినియోగదారుల ప్రైవసీకి పూర్తి భద్రత ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది. కేవలం ఎమర్జెన్సీ కాల్స్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుందని, లొకేషన్ వివరాలు నేరుగా సహాయక కేంద్రానికే వెళతాయని, గూగుల్ ఈ డేటా సేకరించడం గానీ, స్టోరేజిలో సేవ్ చేయడం గానీ చేయదని తెలిపింది.ఈ సర్వీస్ కోసం ఎలాంటి ప్రత్యేక యాప్స్ లేదా హార్డ్‌వేర్ అవసరం లేదు. ఆండ్రాయిడ్ 6.0 లేదా ఆ తర్వాతి వెర్షన్ ఉన్న అన్ని ఫోన్లలోనూ ఇది ఉచితంగా పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి ముందు కొన్ని నెలల పాటు పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పరీక్షించారు. ఈ సమయంలో సుమారు 2 కోట్ల ఎమర్జెన్సీ కాల్స్, SMSలకు ఈ ఫీచర్ ద్వారా లొకేషన్‌ను కచ్చితంగా గుర్తించారు.

Exit mobile version