-ఏకరూప పాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
-650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న గ్రేటర్ పరిధి
-ఇప్పుడు 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరణ
అక్షరగళం , హైదరాబాద్ మహానగరం స్వరూపం మరోసారి మారబోతోంది. ఏకరూప పాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర శివారులోని 20 మున్సిపాలిటీలు, 7 నగర పాలక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసింది. దీని కారణంగా సుమారు 3 వేల కాలనీల చిరునామాలు మారబోతున్నాయి . అంతేకాకుండా, 100కు పైగా కొత్త డివిజన్లు ఏర్పాటయ్యాయి. గతంలో 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న గ్రేటర్ పరిధి ఇప్పుడు 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం డిసెంబర్ 1న ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ విలీన ప్రక్రియ, డివిజన్ల పునర్విభజనను జీహెచ్ఎంసీ అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో పూర్తి చేశారు.కొత్త డివిజన్ల ఏర్పాటు, వాటి హద్దులపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను, ఫిర్యాదులను అధికారులు పరిశీలించారు. శివరాంపల్లిని సులేమాన్‌నగర్‌లో కలపడం వంటి పలు అంశాలపై వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని హద్దుల్లో మార్పులు చేశారు. దీనికి సంబంధించిన తుది నివేదికను సోమవారం ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఫైనల్ గెజిట్‌ను విడుదల చేస్తుంది.భవిష్యత్తులో జీహెచ్ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి మాత్రం యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.
