– ఉత్తర్వులను జారీ చేసిన కమిషనర్ ఆర్.వి. కర్నన్
– బదిలీ చేసిన బాధ్యతలు స్వీకరించనీ డిప్యూటీ కమిషనర్ వి శ్రీనివాస్ రెడ్డి
– అల్వాల్ సర్కిల్ డీసీ గా ఉన్న సమయంలో..
– అనేక అంశాలలో ఆది నుంచి ఆరోపణలు
– పలుమార్లు ఫిర్యాదు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
అక్షరగళం, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బదిలీ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, బదిలీ అయిన స్థానంలో విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిప్యూటీ కమిషనర్ వి శ్రీనివాస్ రెడ్డి కఠిన చర్యలు తీసుకున్నారు జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్నన్. ఈ మేరకు ఆదివారం ఆయన సస్పెండ్ ఉత్తరలను జారీ చేశారు. జిహెచ్ఎంసి పునర్వ్యవస్థీకరణలో భాగంగా అల్వాల్ సర్కిల్ లో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని కావడిగూడ సర్కిల్ కు బదిలీ చేస్తూ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. తక్షణమే బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ఆయన బాధ్యతలు తీసుకోకుండా ఉన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన జిహెచ్ఎంసి కమిషనర్
ఆర్.వి. కర్నన్ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆర్డర్స్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లా డిపార్ట్‌మెంట్ నుంచి డిప్యూటేషన్‌పై ఆయన జిహెచ్ఎంసిలో ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చారు. విచారణ పూర్తయ్యే వరకు పరిపాలనా ప్రయోజనాల దృష్ట్యా ఆయనను సస్పెండ్ చేయడం జరిగిందని అధికార యంత్రాంగం పేర్కొంది. అవసరమని కమిషనర్ అభిప్రాయపడ్డారు.
ఆది నుంచి ఆరోపణలే..
సస్పెండ్ అయిన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పై ఆది నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. అల్వాల్ సర్కిల్ లో పనిచేస్తున్న సందర్భంలో ఖాళీ స్థానంలో పదుల సంఖ్యలో ఇంటి నెంబర్లు జారీ చేశారనే ఆరోపణపై ఆయన విజిలెన్స్ ఎంక్వయిరీ ఎదుర్కొన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఓ సీనియర్ సిటిజన్ కు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ విషయంలో ఆయన పరిధికి మించి ప్రవర్తించడంతో సదరు సీనియర్ సిటిజన్ జిహెచ్ఎంసి ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం ఆయనపై అనేక ఫిర్యాదులు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన సమాచారం ఇవ్వకుండా దాస్తున్నారని, విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం ప్రోటోకాల్ పాటించడం అంశంలో కూడా ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఇలా అనేక అంశాలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

