– హారర్ థ్రిల్లర్‌గా ‘ఈషా’
– రెగ్యులర్ హారర్ కథ గా ‘ఈషా’
చిన్న సినిమాలను తమదైన శైలిలో ప్రమోట్ చేస్తూ.. ఆ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడంలో నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటిలు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలతో తమ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ద్వయం ఈసారి ‘ఈషా’ అనే హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ చిత్ర కథ ఏమిటి? ఈ హారర్ సినిమా ప్రేక్షకులను భయపెట్టిందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం.

ఆత్మలు, దెయ్యాలు అనేవి మూడ నమ్మకాలు అంటూ నమ్మే నలుగురు మిత్రులు కల్యాణ్ (త్రిగుణ్), వినయ్ (అఖిల్‌రాజ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు)లు మూఢనమ్మకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న దొంగబాబాలు, స్వామిజీల గుట్టు బయట పెట్టాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో దేవ్ (పృథ్వీరాజ్) డాక్టర్‌గా ప్రాక్టీస్ మానేసి, దెయ్యాలు పట్టిన వాళ్ల సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. ఈ నలుగురు మిత్రులు దేవ్ ఆట కట్టించేందుకు సిద్దమై ఆయన దగ్గరికి వెళతారు. అప్పుడు వీళ్లకు ‘ఆత్ములు ఉన్నాయని నేను నిరూపిస్తాను. అంటూ దేవ్ దగ్గరి నుంచి సవాల్ ఎదురవుతుంది. ఇందుకోసం ఈ స్నేహితులు అక్కడ పాడు బడిన భవంతిలో మూడు రోజులు ఉంటారు? ఇక ఆ తరువాత ఏమైంది. ఈ మిత్రబృందానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. నిజంగా ఆ భవంతిలో ఆత్మలున్నాయా? ఈ నలుగురి మిత్రుల్ని పగతో ఓ గిరిజనుడు (మైమ్ మధు) ఎందుకు చంపాలనుకున్నాడు? పుణ్యవతి ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశించింది? అసలు పుణ్యవతి ఎవరు? ఇలాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

కధ విశ్లేషణ చుస్తే , దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? లేవా? ఎప్పట్నుంచో కొనసాగుతున్న ఈ వాదనను ఆధారంగా, కొన్ని పాత్రలు క్రియేట్ చేసుకున్న ఇదొక సింపుల్ హారర్ స్టోరీ.. ప్రేక్షకులను భయపెట్టడమే పనిగా దర్శకుడు ఈ కథను, స్క్రీన్‌ప్లేను అల్లుకున్నట్లుగా అనిపిస్తుంది. సాధారణంగా హారర్ సినిమా అనగానే ఆ సినిమాలోని పాత్రలకు దెయ్యం ఆవహించడం.. అందుకు తగ్గట్టుగా కొన్ని భయంకరమైన సన్నివేశాలు, సినిమాలోని కీలక పాత్రలు పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్లడం.. పతాక సన్నివేశాల్లో సినిమాటిక్‌గా ముగింపు. ఈ సినిమా కూడా ఇదే ఫార్ములాను అనుసరించినట్లుగా అనిపించింది.

నటీనటుల పనితీరు విషయానికివస్తే , నటీనటులు త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంత తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అయితే ఈ బృందంలో ఎవరికి కూడా చెప్పుకోదగ్గ సన్నివేశాలు లేకపోవడంలో నటనా పరంగా వాళ్ల మార్క్‌ను చూపించుకునే అవకాశం రాలేదు. ఈ సినిమాలో అందర్ని మైమ్ మధు తన నటనతో మెప్పించాడు. ఆయన వేషధారణ కూడా అత్యంత భయంకరంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా ఆయనకు నటుడిగా మంచి పేరును తీసుకొస్తుంది. దర్శకుడు భయపెట్టడమే పనిగా పెట్టుకోని, ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించాలనే విషయాన్ని విస్మరించాడు. కొన్ని బలమైన సన్నివేశాలు, సంభాషణలు రాసుకొని ఉంటే సినిమా స్థాయి పెరిగేది. సంతోష్ డార్క్ విజువల్స్ హారర్ సినిమాలో ఉంటే ఫియర్‌ను కలిగించడంలో ప్లస్ అయ్యింది. నేపథ్య సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

