Tuesday, January 13, 2026
No menu items!
Advertisement
హోమ్జిహెచ్​​ఎంసిALLతెలుగులోనే అభియోగపత్రం… పోలీస్ చరిత్రలో కొత్త అధ్యాయం

తెలుగులోనే అభియోగపత్రం… పోలీస్ చరిత్రలో కొత్త అధ్యాయం

– తొలిసారిగా దుండిగల్ పోలీస్ స్టేషన్ లో రూపకల్పన

– రెండు కేసులను తెలుగులో రూపొందించిన మహిళా కానిస్టేబుల్ స్వరూప

– స్థానిక భాషలో చార్జ్ షీట్ లను రూపొందించడంపై ప్రశంసలు.

– అభినందించిన రాష్ట్ర డిజిపి శశిధర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్

అక్షరగళం, దుండిగల్: గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల పరిసరాల్లో ఇప్పటికీ ఆంగ్ల భాషపై పట్టు లేని వారి సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఇంగ్లీషులో ఉన్న పోలీస్ పత్రాలు, చార్జ్‌షీట్లు సామాన్యులకు అర్థం కాకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉంది. దీనిని అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వరూప తెలుగు భాషలో చార్జ్ షీట్ లను రూపొందించడం పై రాష్ట్ర పోలీసు డిజిపి శశిధర్ రెడ్డి ప్రశంసించారు. ఉన్నతాధికారుల సహకారంతో స్థానిక భాష అయిన తెలుగులో అభియోగ పత్రాలను అందించి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు.

తొలిసారిగా తెలుగులో..
ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ ప్రక్రియలు అన్నీ ఆంగ్ల భాషకే పరిమితమవుతున్న కాలంలో, ప్రజల మాతృభాషలోనే న్యాయ సంబంధిత వివరాలను రిపోర్టులను అందించాలన్న దృక్పథంతో దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వరూప పోలీస్ శాఖలో కొత్త ఒరవడికి తెర లేపారు. 2025 సంవత్సరంలో తనకు కేటాయించిన రెండు కేసుల్లో పూర్తిగా తెలుగులోనే దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రాలు దాఖలు చేయడం ద్వారా బాధితులు, నిందితులు కేసు వివరాల చార్జిషీట్లను సులువుగా అర్థం చేసుకునే ప్రక్రియను మరింత దగ్గర చేశారు. ఎటువంటి తప్పులకు తావు లేకుండా పూర్తిగా తెలుగులో చార్జి షీట్ లను రూపొందించి ఉన్నత అధికారులకు విజయవంతంగా నివేదించారు.

రెండు కేసులలో…
మొదటి కేసులో బౌరంపేట్‌కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి తన కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచి విక్రయాలు జరుపుతున్నట్టు తేలడంతో, దుండిగల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాల ఆధారంగా ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసి, మేడ్చల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టుకు పూర్తిగా తెలుగులోనే అభియోగపత్రం సమర్పించడం తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అరుదైన ఘట్టంగా నిలిచింది. మరో ఘటనలో అర్ధరాత్రి సమయంలో అదృశ్యమైన 35 ఏళ్ల వలస కూలీ మహిళ, ఆమె నాలుగేళ్ల కుమార్తె కేసులో స్వరూప వేగంగా స్పందించారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుపై కేసును తక్షణమే ఛేదించి తల్లి–పాపను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ఈ ఘటనపై తన దర్యాప్తు తుది నివేదికను కూడా తెలుగులోనే ఏసీపీ మేడ్చల్ శంకర్ రెడ్డికి సమర్పించారు.

ప్రశంసించిన డిజిపి
ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర అధికార భాషల్లో ఒకటైన తెలుగులోనే అభియుగ పత్రాలను రూపొందించిన విధానాన్ని మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వరూప ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల బంజారా హిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్., సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, ఐపీఎస్., సమక్షంలో 50 మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసలు అందుకున్న సైబర్ యోధుల్లో ఒకరిగా నిలవడం ఆమె కృషికి నిదర్శనం.

మాతృభాషలో న్యాయ ప్రక్రియను ప్రజలకు చేరువ చేసిన ఈ ప్రయత్నం, భవిష్యత్తులో పోలీస్ శాఖలో ఒక మార్గదర్శకంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక పోలీస్ శాఖలోనే కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలలో స్థానిక భాష అయినా తెలుగులో నే ఉత్తర ప్రత్యుత్తరాలు, నివేదికలు రూపొందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments