– హైడ్రా కమిషనర్ రంగనాథ్ వద్ద విధులు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య
– ఆర్థిక ఒత్తిళ్లే కారణమని ప్రాథమిక నిర్ధారణ
– పరిస్థితి విషమం
అక్షరగళం, హైదరాబాద్: నగరంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. 2020 బ్యాచ్‌కు చెందిన, సిఎస్‌డబ్ల్యూ విభాగంలో పనిచేస్తూ హైడ్రా కమిషనర్ వద్ద విధులు నిర్వహిస్తున్న ముత్యాలపాయటి కృష్ణ చైతన్య (హైదరాబాద్) శనివారం ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో మునగనూర్‌లోని సాయి సూర్య నగర్, రోడ్ నెం.3లో ఉన్న తన నివాసంలో సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఘటనను గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతుండగా, పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. శస్త్రచికిత్స కొనసాగుతోందని, ప్రాణాపాయ ప్రమాదం తొలగలేదని పేర్కొన్నారు.
స్పందించిన హైడ్రా కమిషనర్
ఈ ఘటనపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ విషయాన్ని మీడియా సంచలనం చేయొద్దని కోరారు. ఆయన ఆస్పత్రికి వెళ్లి కానిస్టేబుల్ చైతన్యను పరామర్శించారు. ప్రాథమిక విచారణలో ఆర్థిక సమస్యలే ఈ దుర్ఘటనకు కారణమై ఉండొచ్చని తెలిపారు. దాదాపు రెండేళ్ల క్రితం బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లలో పాల్గొనడం వల్ల చైతన్య తీవ్ర అప్పుల భారంలో కూరుకుపోయాడని, ఆ అప్పుల కారణంగా జీతంలో పెద్ద మొత్తంలో కోత పడుతోందని వెల్లడించారు. అలాగే సుమారు మూడు నెలల క్రితం కుటుంబ సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటనలో హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనట్లు చెప్పారు. ఆ తరువాత నుంచి నాడీ సంబంధిత సమస్యలు, మెదడు సంబంధిత ఆరోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నప్పటికీ, విధుల పరంగా ఎలాంటి నిర్లక్ష్యం చూపలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వైద్య చికిత్స అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
