– పథకంలో “మహాత్మా గాంధీ” పేరు తొలగింపు గ్రామీణ భారతానికి అవమానం
– ఫ్ల కార్డ్స్ తో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
– పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ నాయకత్వం లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ లు పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ చరిత్రను మార్చే ప్రయత్నం..: కోలన్ హనుమంత్ రెడ్డి
గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలనే మహాత్మా గాంధీ ఆశయంతో ప్రారంభమైన చట్టానికి పేరు మార్చడం బీజేపీ ప్రభుత్వ రాజకీయ సంకుచితత్వానికి నిదర్శనమని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత రెడ్డి పేర్కొన్నారు. పేరుమార్పులకన్నా కూలీల కనీస వేతనాల పెంపు, పనిదినాలను 100 నుంచి 200కు పెంచడం, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం దేశ చరిత్రను మార్చే ప్రయత్నమని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.
పేదలకు చేస్తున్న అవమానం
గ్రామీణ పేదల చెమటతో నడిచే చారిత్రాత్మక ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం కోట్లాది పేదలకు చేసిన అవమానమని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మండిపడ్డారు. ఇప్పటికే నిధుల కోతలు, బకాయిల పెంపు, పనిదినాల తగ్గింపుతో ఉపాధి హక్కును బలహీనపరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు రాజకీయ ద్వేషంతో గాంధీజీ పేరును కూడా తొలగించాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని తీవ్రంగా దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సంకల్పంతో ఈ పథకం అమలులోకి వచ్చిందని, దీనివల్ల గ్రామీణ వలసలు తగ్గి నిరుపేద కుటుంబాలకు జీవనాధారం లభించిందని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు, మహిళా, యూత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు.
