కైమ్ర్ బ్రాంచ్ పోలీసుల ముందు సల్మాన్ వాంగ్మూలం
నన్ను, నా కుటుంబాన్ని చంపాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్రలు పన్నతోందని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ఆ క్రమంలోనే తన ఇంటిపై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ముంబయి కైమ్ర్ బ్రాంచ్ పోలీసుల ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ఈ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ ఇంటిపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసులు 1700లకుపైగా పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాల్పులు జరిగిన ఏప్రిల్ 14వ తేదీన ఇంట్లోనే ఉన్నానని, తూటాల శబ్దంతోనే నిద్రలేచానని సల్మాన్ అందులో పేర్కొన్నారు. తెల్లవారుజామున 4.55కు ఇద్దరు సాయుధ దుండగులు బైక్‌పై వచ్చి, మొదటి అంతస్తు బాల్కనీపై కాల్పులు జరిపిన విషయాన్ని బాడీగార్డ్ వచ్చి తనకు చెప్పినట్లు వివరించారు.
తనతోపాటు తన కుటుంబంపై గతంలోనూ దాడి ప్రయత్నాలు జరిగాయని ఖాన్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాంద్రా పోలీస్ స్టేషన్‌లో తన బాడీగార్డ్ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ దాడులకు తామే బాధ్యులమంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి సోదరుడు అన్మోల్‌లు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన విషయాన్ని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.