aksharagalam.com

కల్తీ నెయ్యి–పరకామణి దొంగతనం పై చర్చకు సిద్ధం: భానుప్రకాశ్ రెడ్డి సవాల్

అక్షర గళం, తిరుపతి:
కల్తీ నెయ్యి, పరకామణి దొంగతనం వంటి కీలక అంశాలపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు.

జగన్ వ్యాఖ్యలు అవమానకరమైనవి: భానుప్రకాశ్

జగన్ శ్రీవారి ఆలయం సంబంధించిన వ్యవహారాన్ని ఎగతాళిగా మాట్లాడటం తగదని భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ దేవుడు విషయమై కూడా ఇలానే మాట్లాడుతారా? శ్రీవారి ఖజానాలో దొంగతనం జరిగితే చిన్న విషయం ఎలా అవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు.పరకామణి ఘటనను తేలికగా తీసుకోవడం వల్ల భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్తీ నెయ్యి దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వస్తాయి

కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోందని, అన్ని వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. వైసీపీ పాలనలోనే దేవుడి పేరుతో రాజకీయాలు జరిగాయని ఆరోపిస్తూ, “వేంకటేశ్వరస్వామితో మేము రాజకీయాలు చేయం; గత ప్రభుత్వం చేసింది” అని వ్యాఖ్యానించారు.

పరకామణి దొంగతనంపై రాజకీయ రాజీనా?

పరకామణి దొంగతనం ఘటనకు సంబంధించి జగన్ పాత్రపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
“దొంగతనం చేసిన వారు జగన్ వద్దకు వెళ్లితే రాజీ చేస్తారా? దీనిలో జగన్‌కు భాగస్వామ్యం ఉన్నట్టే కనిపిస్తోంది” అని ఆయన ఎద్దేవా చేశారు.

విమర్శలు అనవసరం

కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులపై జగన్ చేసిన విమర్శలు అభాసుపాలయ్యేలా ఉన్నాయని భానుప్రకాశ్ పేర్కొన్నారు. అధికారులపై విమర్శలు అనవసరమని తెలిపారు. పోలీస్ అధికారులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, “వైవీ సుబ్బారెడ్డి గోపూజలు చేస్తామని చెబుతున్నారు; మరి కల్తీ నెయ్యి వాడినప్పుడు ఎందుకు స్పందించలేదు?” అని ప్రశ్నించారు.

భక్తుల మనోభావాలతో ఆటలా..?
వైసీపీ నాయకత్వం భక్తుల మను భావాలను దెబ్బతీస్తోంది అని, జగన్ మాట్లాడిన తీరు హిందూ భక్తుల మనస్సును గాయపరచేలా ఉందని భానుప్రకాశ్ రెడ్డి విమర్శించారు. భక్తులు సమర్పించే కానుకలు పట్ల గౌరవం చూపాల్సిన సమయంలో నిర్లక్ష్య ధోరణి అనుచితమని పేర్కొన్నారు.

Exit mobile version