aksharagalam.com

బోండి బీచ్ ఉగ్రదాడి.. హైదరాబాద్ లో మూలాలు

తెలంగాణ పోలీసుల స్పష్టీకరణ

27 ఏండ్ల క్రితం స్టూడెంట్ వీసా తో ఆస్ట్రేలియాకు

గతాన్ని ఆరా తీస్తున్న ఎన్ ఐ ఎ

దాడికి ముందు సాజిద్, నవీద్‌లు ఫిలిప్పీన్స్‌కు వెళ్లినట్లు గుర్తింపు

అక్షరగళం, హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని ప్రసిద్ధ బోండి బీచ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడి కేసులో కీలకమైన కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందినవాడేనని తెలంగాణ పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. దీంతో గతంలో పాకిస్తాన్ మూలాలు ఉన్నాయని వచ్చిన కథనాలు ఊహాజనితం అయ్యాయి. తెలంగాణ పోలీసుల వివరాల ప్రకారం, సాజిద్ అక్రమ్ సుమారు 27 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. హైదరాబాద్‌లోని తన కుటుంబంతో అతనికి చాలా పరిమిత సంబంధాలే ఉన్నాయని, అతని తీవ్రవాద భావజాలానికి, చర్యలకు భారతదేశంతో, తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వివరాలను పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

దాడి వివరాలు
ఈ దారుణ ఘటన ఆదివారం బోండి బీచ్‌లో హనుక్కా వేడుకలు జరుగుతున్న సమయంలో చోటు చేసుకుంది. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, అతని 24 ఏళ్ల కుమారుడు నవీద్ అక్రమ్ కలిసి ఎత్తైన పాదచారుల మార్గం నుంచి జనాలపై విచక్షణలేని కాల్పులు జరిపారు. ఈ దాడిలో 10 ఏళ్ల బాలిక, ఒక పదవీ విరమణ పొందిన పోలీసు అధికారి తో సహా మొత్తం 16 మంది మృతి చెందారు. ఇంకా 25 మందికి పైగా గాయపడ్డారు, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 10 నిమిషాల పాటు కాల్పులు కొనసాగడంతో బీచ్ ప్రాంతమంతా భయాందోళనకు గురైంది. కుటుంబాలు, పర్యాటకులు ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు.

పోలీసు కాల్పులలో..
సంఘటనా స్థలంలోనే పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్రమ్ మరణించాడు. నవీద్ అక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేసి, ప్రస్తుతం అతను పోలీసు కాపలాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు. సాజిత్ తండ్రి విదేశాలలో ఉన్న డిఫెన్స్ శాఖలు పనిచేసినట్లుగా గుర్తించారు.

ఉగ్రవాద దాడిగా..
ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉగ్రవాద దాడిగా అధికారికంగా ప్రకటించింది. నవీద్ పేరుతో నమోదైన వాహనం నుంచి ఇస్లామిక్ స్టేట్ (IS)కు సంబంధించిన జెండాలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా పలు తుపాకీలను కూడా పోలీసులు పట్టుకున్నారు. వాటిలో కొన్ని చట్టబద్ధమైన తుపాకీ లైసెన్స్ కింద సాజిద్ వద్ద ఉన్నవని వెల్లడించారు. ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఈ దాడిని “ఇది పూర్తిగా దుష్ట చర్య, యూదు వ్యతిరేక ఉగ్రవాద చర్య” గా అభివర్ణించారు. ఈ దాడి ఆస్ట్రేలియాలోని యూదు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే జరిగిందని ఆయన అన్నారు.

విదేశీ ప్రయాణాలపై దర్యాప్తు
దాడికి ముందు సాజిద్, నవీద్‌లు ఫిలిప్పీన్స్‌కు వెళ్లిన విషయంపై కూడా భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.
ఇరువురు నవంబర్ 1న ఫిలిప్పీన్స్‌కు వెళ్లి నవంబర్ 28న తిరిగివచ్చినట్లు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్ధారించారు. ఈ ప్రయాణం వెనుక సైనిక తరహా శిక్షణ పొందారా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో ఆస్ట్రేలియాలో తుపాకీ చట్టాలపై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే కఠినమైన తుపాకీ నియంత్రణ ఉన్నప్పటికీ, మరింత కఠినతరం చేసే అవకాశాలపై ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. బాధితులకు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా జెండాలను పాక్షికంగా అవనతం చేశారు. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ ఘటన, ఆస్ట్రేలియా చరిత్రలో అత్యంత విషాదకరమైన సామూహిక కాల్పుల ఘటనలలో ఒకటిగా నిలిచింది. కాగా దర్యాప్తుల నేపథ్యంలో బోండి బీచ్ మంగళవారం వరకు నేరస్థలంగానే కొనసాగింది. బుధవారం మధ్యాహ్నం నుంచి తిరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

Exit mobile version