అక్షర గళం, పల్నాడు:
చదువు శక్తి, ఉపాధ్యాయుల పాత్ర, విద్యార్థుల భవిష్యత్ నిర్మాణం వంటి అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిలకలూరిపేటలో జరిగిన ఉపాధ్యాయ–తల్లిదండ్రుల సమావేశంలో ప్రేరణనిచ్చే ప్రసంగం చేశారు. “మన బలమైన ఆయుధం చదువే… భవిష్యత్తు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే” అంటూ పేర్కొన్నారు.
విద్యార్థుల జీవితాన్ని మార్చేది వారే
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తల్లిదండ్రులకన్నా ఉపాధ్యాయుల ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. “గురువు చూపే మార్గమే మన భవిష్యత్తుకు పునాది” అని పేర్కొన్నారు. మైలవరపు కృష్ణ తేజ తాతగారి సేవా భావాన్ని గుర్తుచేస్తూ, పాఠశాలలకు పెద్దలు స్థలాలు ఇచ్చే సంస్కృతి తగ్గిపోవడం దురదృష్టకరమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని తెలిపారు.
ఆలోచన అద్భుతం
ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల సమావేశాలకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పవన్ తెలిపారు. లోకేష్ ప్రారంభించిన ఈ కార్యక్రమం విద్యా సంస్కరణలకు కొత్త దిశగా నిలుస్తుందని అన్నారు. “పిల్లల బలాలు, బలహీనతలు తెలుసుకోడానికి PTMలు వేదిక అవుతాయి… కేరళలో తల్లిదండ్రుల సంఘాలు ఎంత చురుకుగా ఉంటాయో మనం నేర్చుకోవాలి” అని సూచించారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, ఇంత మంచి ఆలోచన అద్భుతమైనదని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ను ఆయన అభినందించారు.
చిన్న గొడవలకు కులరంగు?
పిఠాపురంలో విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవను కులాలకు అంటగట్టడం తీవ్ర తప్పు అని పవన్ మండిపడ్డారు. “పిల్లల విషయాల్లో కులాలను లాగడం సమాజాన్ని వెనక్కి నెడుతుంది” అన్నారు. పిల్లలు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను పవన్ ప్రశంసిస్తూ— “పిల్లల ప్రతిభ అద్భుతం… వారు తయారు చేసిన పరికరాలు వారి నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి” అని అన్నారు.
స్కూల్ అవసరాలపై వెంటనే స్పందన
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాఠశాలకు అవసరమైన కంప్యూటర్లు లైబ్రరీ ఏర్పాటు క్రీడా ప్రాంగణం కేటాయింపు హామీలను ఇచ్చారు.
పాఠశాలలో ఇప్పటివరకు ఉన్న ఉన్న 10 కంప్యూటర్లను 25కి పెంచుతానని అన్నారు. క్రీడా మైదానం లేని సమస్యపై విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలించాలని ఆదేశించారు. బాలికలకు ఆత్మరక్షణ విద్య అత్యవసరం అని పేర్కొన్నారు. “పిల్లల ఆలోచనాశక్తిని పెంచేది లైబ్రరీ… శరీర–మనసు వికాసానికి క్రీడా మైదానం తప్పనిసరి” అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
“చదువే లక్ష మెదళ్లను కదిలించే ఆయుధం”
పవన్ విద్య శక్తి గురించి భావోద్వేగంగా మాట్లాడారు. “ఏ మాధ్యమంలో చదివామన్నది ముఖ్యం కాదు… విభిన్న అంశాలపై పట్టు సాధించడం ముఖ్యమైనది” అని అన్నారు. అబ్దుల్ కలాం తమిళ మాధ్యమంలో చదివి ప్రపంచ అత్యుత్తమ శాస్త్రవేత్తగా ఎదిగారని గుర్తుచేశారు. చిన్నప్పుడు సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు తన జీవితాన్ని బలపరిచాయని పవన్ చెప్పారు. “విద్యార్థులను భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదే” అని ముఖ్యంగా పేర్కొన్నారు.
సినిమా ఒక వినోదం మాత్రమే..
“బూతులు మాట్లాడే నేతలను పట్టించుకోవద్దు… సినిమా చిన్న వినోదం మాత్రమే” అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థులకు సూచించారు. స్థలాలు లాక్కొనేవారి వల్ల పాఠశాలలకు క్రీడా మైదానాలు దొరకడం లేదని, అధికారులు దీన్ని వెంటనే పరిష్కరించాలన్నారు. మాదకద్రవ్యాల వాడకంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.“గంజాయి వంటి మత్తు పదార్థాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయి… యువత అటువైపు అస్సలు చూడొద్దు” అని స్పష్టంగా విద్యార్థులకు తెలియజేశారు. ఈ అంశంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ, పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ మాటలను ఉదహరిస్తూ పవన్ అన్నారు. “మన సంపాదన పోవచ్చు… కానీ చదువు పోదు. జ్ఞానం ఎప్పటికీ మనదే” అని తెలిపారు.
