తెలంగాణలో పంచాయతీ ఎన్నికల జాతర
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల జాతర
గ్రామ పంచాయతీ ఎన్నికలతో…పల్లెల్లో కొత్త ఉత్సాహం
తెలంగాణ పల్లెల్లో ఎన్నికల హుషారు
ప్రధాన పార్టీల మద్ధతుతో అభ్యర్థుల జోరు
ఈ సారి ఏకగ్రీవాల్లో పందెల తీరు
తెలంగాణ పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు అతీతంగా నిర్వహించాలి. అయితే అన్ని పార్టీలు తమ మద్ధతుగల అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఎప్పటిలాగే ఈ సారి కూడా అధికార పార్టీ ప్రభావం గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఉండనుంది. ఇది ఇప్పటికే మొదటి విడత ఎన్నికల ఫలితాలతో రుజువయ్యింది. అత్యధిక శాతం సర్పంచ్ పదవులను అధికార కాంగ్రెస్ పార్టీ మద్ధతుదారులు కైవసం చేసుకున్నట్టు తేలింది.
తెలంగాణ పంచాయతీ సర్పంచ్ పదవులకు తొలి విడత 4,236 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా…
1910 స్థానాల్లో కాంగ్రెస్ మద్ధతు అభ్యర్థులు…
965 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు…
155 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు…
425 స్థానాల్లో ఇతర అభ్యర్థులు విజయం సాధించారు.

రెండేళ్ళు ఆలస్యంగా పంచాయతీ ఎన్నికలు…నిధులు లేక కుప్పకూలిన గ్రామ పాలన వ్యవస్థ
తెలంగాణలో కొన్ని రాజకీయ కారణాల వల్ల రెండేళ్ళు ఆలస్యంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు లేకపోవడం…గ్రామాలకు ప్రతినిధులు లేక ఈ రెండేళ్ళ కాలంలో సరైన నిధులు లేక గ్రామాలు సమస్యల నిలయంగా మారాయి. చాలా మంది సర్పంచులు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో గ్రామాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ కారణాలను షాకుగా చూపుతూ వచ్చింది. ఎన్నికలకు వెళితే ఓడిపోతామనే భయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వెంటాడింది అని చెప్పవచ్చు.
2025 తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే…
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ 09 విడుదల చేస్తూ సెప్టెంబర్ 26న తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ జీవో ఆధారంగా రిజర్వేషన్ల గెజిట్లను పంచాయతీరాజ్‌శాఖ విడుదల చేసింది. ఆ మేరకు తెలంగాణలో స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల ఎన్నికల షెడ్యూల్‌ను సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
హైకోర్టు బ్రేక్…
తీరా రెండేళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్ చేస్తూ బుట్టెంగారి మాధవరెడ్డి, జలపల్లి మల్లవ్వలు హైకోర్టులో పిటిషన్ వేశారు. గత రిజర్వేషన్లు రద్దు చేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నారని పిటిషనర్ తెలపగా, విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు హైకోర్టులో ఉండగానే సుప్రీంకోర్టులో వంగా గోపాల్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను చేప్పట్టిన అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేస్తూ కేసు కొట్టివేసింది.
బీసీ రిజర్వేషన్లపై అక్టోబర్ 8[8] & 9న విచారణ చేపట్టిన హైకోర్టు జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో, హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ అక్టోబర్ 9న రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ను అధికారులు ఎత్తివేశారు.
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల…
తిరిగి మరోసారి తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని 2025 నవంబర్ 25న విడుదల చేసింది. నవంబర్ 25 నుండే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపింది. రాష్ట్రాల్లోని 31 జిల్లాలో 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 3 విడతల్లో డిసెంబర్ 11,14,17 తేదీల్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఏకగ్రీవాల జోరు…
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. కొన్నిచోట్ల అభ్యర్థులు స్వచ్ఛందంగా తప్పుకోగా, మరికొన్ని చోట్ల నేతల ఒత్తిడితో నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలిసింది.
నిజామాబాద్ జిల్లాలో మాక్లూర్ మండలంలో 28 జీపీలు ఉంటే, 7 చోట్ల పోటీ లేకుండా పోయింది. కొత్తపల్లి, అమ్రాద్ తండా, మెట్‌పల్లి, ముత్యపల్లి, మాదాపూర్, గంగరమంద, సింగంపల్లి సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని అధికారులు ప్రకటించారు.
ధర్పల్లి మండలంలో 6 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మోదిన్‌సాబ్ తండా, మద్దుల్ తండాలను మాత్రమే ఏకగ్రీవమైనట్లు అధికారికంగా ప్రకటించారు. సీతాయిపేట్, నడిమి తండా, గుడి తండా, ఇందిరానగర్ తండా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనప్పటికీ, కలెక్టర్ నుంచి ఎన్‌వోసీ వచ్చాక అధికారికంగా ప్రకటించనున్నారు.
సిరికొండ మండలంలో 6, డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి మండలాల్లో 3 చొప్పున, మోపాల్ మండలంలో ఒకటి చొప్పున ఏకగ్రీవమయ్యాయి.
నాగిరెడ్డిపేట మండలంలో 6 సర్పంచ్, 103 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
లింగంపేట మండలం లింగంపల్లి పాలకవర్గం ఏకగ్రీవమైంది.
నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ తండా సర్పంచ్‌తో పాటు 8 వార్డు స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రెండో విడతలో ఇప్పటికే ఏకగ్రీవాలు…
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 415 మంది సర్పంచ్‌లు, 8304 మంది వార్డు మెంబర్లు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డిలో అత్యధికంగా 44 పంచాయతీల్లో ఏకగ్రీవం జరిగింది. ఇక నిజామాబాద్, నల్గొండలో 38 గ్రామాల చొప్పున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండో విడతలో భాగంగా 4332 గ్రామాలు, 38,322 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ, 5 గ్రామపంచాయతీలు, 107 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడం గమనార్హం. అలాగే, సర్పంచి ఎన్నిక మొదటి విడత నుంచి 7,584 మంది, వార్డుల్లో 10,427 మంది తమ నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. మొదటి విడతతో కలిసి మొత్తం 810 మంది సర్పంచ్‌లు, 17,635 మంది వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఏకగ్రీవాలతో ఆయా గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి.
మూడో విడతలో ఇప్పటికే 394 స్థానాలు ఏకగ్రీవం…
మూడో విడతలో భాగంగా మొత్తం 4,158 సర్పంచ్ స్థానాల్లో.. 394 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఇక పలు కారణాల వల్ల 11 గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. దీంతో మిగిలిన 3,752 స్థానాలకు మొత్తం 12,640 మంది అభ్యర్థులు సర్పంచ్ రేసులో నిలిచారు. కాగా, సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల స్థానాలు కూడా భారీగా ఏకగ్రీవం అయ్యాయి. మూడో విడతలో మొత్తం 36,434 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఇందులో 7,916 స్థానాల్లో వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మిగిలిన 28,406 వార్డు స్థానాలకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా, 112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు.
ఏకగ్రీవాల వల్ల ప్రశ్నించే వారు ఉండరని…ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఆడిందే ఆట…పాడిందే పాటగా మారుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి.
అయితే…అక్కడక్కడ అనివార్య కారణాల వల్ల ఏకగ్రీవాలు వీగిపోతున్నా…డిసెంబర్ 17 వచ్చేనాటికి ఏకగ్రీవాలు పెరిగే అవకాశం ఉందని అంచనాలు కూడా ఉన్నాయి.


