Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్జాతీయం - అంతర్జాతీయంఅమెరికాలో అధికారికంగా ప్రారంభమైన 'గోల్డ్ కార్డ్' పథకం

అమెరికాలో అధికారికంగా ప్రారంభమైన ‘గోల్డ్ కార్డ్’ పథకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిష్ఠాత్మక ‘గోల్డ్ కార్డ్’ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం కింద 1 మిలియన్ డాలర్లు చెల్లించే వ్యక్తులకు, లేదా ఒక్కో విదేశీ ఉద్యోగికి 2 మిలియన్ డాలర్లు చెల్లించే కార్పొరేట్ సంస్థలకు అమెరికాలో చట్టబద్ధమైన నివాసం కల్పించి, పౌరసత్వానికి మార్గం సుగమం చేయనున్నారు. ఈ మేరకు దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

వైట్‌హౌస్‌లో బుధవారం వ్యాపార ప్రముఖుల సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. 1990 నుంచి అమల్లో ఉన్న ఈబీ-5 వీసా స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా వచ్చే నిధులన్నీ నేరుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయని, దేశ ప్రగతికి ఉపయోగిస్తామని ట్రంప్ తెలిపారు. “ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే కానీ, దానికంటే చాలా ఉత్తమమైనది, శక్తిమంతమైనది” అని ఆయన తెలిపారు.

ఒకవైపు కఠినమైన వలస విధానాలు అమలు చేస్తూ, భారీస్థాయిలో బహిష్కరణలు చేపడుతున్న ట్రంప్, మరోవైపు సంపన్న వలసదారుల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో చదివిన ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఇక్కడే అట్టిపెట్టుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ట్రంప్‌ అన్నారు.

ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకునే వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు 15,000 డాలర్ల ఫీజు వసూలు చేస్తామని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ తెలిపారు. భారత్, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి వచ్చే అత్యుత్తమ గ్రాడ్యుయేట్లు ఈ గోల్డ్ కార్డ్ పొందవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, యూకే, స్పెయిన్, కెనడా వంటి అనేక దేశాల్లో ఇటువంటి ‘గోల్డెన్ వీసా’ పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments