Harish Rao:కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. కాలువకు గండి పడి 23 రోజులు అవుతున్నా పూడ్చడం చేతకావడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్.. ఖమ్మం జిల్లా మంత్రులపై ఫైర్ అయ్యారు. హైడ్రా పైనా కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao:కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు.ఖమ్మం జిల్లాల్లో 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. పంటలు ఎండిపోతున్న పట్టించుకోక పోవడమే రైతులకు ఇచ్చే బహుమానమా? అని ప్రశ్నించారు. కాలువకు గండి పడి 23 రోజులు అవుతున్నా.. పూడ్చడం చేతకావడం లేదా? అని నిలదీశారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. 23 రోజుల్లో ఖమ్మం కు 10 సార్లు అయినా వచ్చి ఉంటారు కదా,గండిపడ్డ కాలువ పక్క నుంచి ఐన వెళ్తారు కానీ అక్కడ ఆగి ఎందుకు ఇంక పూడ్చలేదు అని మాత్రం అడగరు అని హరీష్ రావు అన్నారు. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే, పంటలు ఎండి పోతున్న పట్టించుకోకపోవడమే మీరు రైతులకు ఇచ్చే బహుమానమా? 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే, కనీసం హెలికాప్టర్ పంపకుండా తొమ్మిది మంది ప్రాణాలు బాలి తీసుకున్న పరిస్థితి మీది. మాట్లాడితే ఆకాశాన్ని దించుతాం, సూర్యుని దించుతామని పెద్ద పెద్ద డైలాగులు కొడుతారు’ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
‘తలాపున సముద్రం ఉన్నా చేప నీళ్లకు ఏడ్చిందంట. ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణా నదిలో నిండుగా నీరు ఉన్న ఖమ్మం జిల్లా రైతులు సాగు నీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ముగ్గురు మంత్రుల సమన్వయ లోపం.నీటి పారుదల శాఖ మంత్రి నిర్లక్ష్యం. ముఖ్యమంత్రికి పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండి పోతున్నాయి. కాలువకు గండి పడి 22 రోజులైనా పూడ్చలేదు.. ఇన్ని రోజులైనా గండిని పూడ్చలేని ఈ నాయకులూ , కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు’ అని హరీశ్ రావు సెటైర్లు వేశారు.’ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప.. పూడ్చివేతలు తెలియదు.పేద ప్రజల ఇండ్లను కూల్చుతూ హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు. సీఎల్పీ భేటీకి అరెకపూడి గాంధీ ఎందుకు వచ్చారు. ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే, సీఎం ఆఫీసుకు వెళ్లాలి కానీ, సీఎల్పీ మీటింగ్‌కు వస్తారా?ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు.మంత్రి శ్రీధర్ బాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు’ అని హరీశ్ రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
అటు హైడ్రా బాధితులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ‘మూడు రోజుల క్రితమే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అంతలోనే కూల్చి వేశారు. మేము కొన్న ఇల్లు ప్రభుత్వ స్థలంలో ఉందని మాకు తెలియదు. రిజిస్ట్రేషన్ ముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాం. అనుమతులు అన్నీ ఉన్నాయని ఇల్లు కొన్నాం. ఇల్లు కూల్చుతామని అధికారులు వచ్చి చెప్పడంతో షాకయ్యాం. ఏండ్ల తరబడి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కొనుక్కున్నాం. బ్యాంకు లోను కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టి అమ్మిన బిల్డర్లు, అనుమతులు ఇచ్చిన అధికారులదే ఈ పాపం. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొని మాలాంటి బాధితులకు న్యాయం చేయాలి’ అని హైడ్రా బాధితులు కోరుతున్నారు.