కుత్బుల్లాపూర్,జూలై 29, (అక్షర గళం ) : జీవో ఎంఎస్ నెంబర్ 15/2019 ప్రకారం ముదిరాజ్ కులస్థులను బిసి-డి నుంచి బీసీ-ఏ లోకి మార్చాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధికై ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సోమవారం నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకవచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న గౌడన్నలకు వైన్ షాపుల కేటాయింపులో 15% రిజర్వేషన్ ఉందని, దీనికి మరొక 15% రిజర్వేషన్ కేటాయిస్తే కులవృత్తులపై ఆధారపడ్డ వారికి ఎంతో ఊరటగా ఉంటుందన్నారు. నేతన్నలపై, బతుకమ్మ చీరలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతగానో భాదించాయన్నారు. బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయిస్తామనడంపై ఎటువంటి మార్గదర్శకాలు లేవని, మీరు బీసీల అభ్యున్నతికి ఏ విధంగా చర్యలు చేపడుతున్నారో తెలియజేయాలన్నారు. కులవృత్తుల వారి ఆత్మగౌరవానికి అద్దం పట్టే విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఆత్మగౌరవ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఐటీ ఎగుమతులను రెండున్నర లక్షల కోట్లకు పెంచాం
58 వేల కోట్ల ఐటీ ఎగుమతులను 2023 వచ్చే వరకు రెండున్నర లక్షల కోట్లకు పెంచామని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు గత బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలను, పెట్టుబడులను ప్రోత్సహించి 2014లో 58 వేల కోట్ల ఐటీ ఎగుమతులను 2023 వచ్చే వరకు రెండున్నర లక్షల కోట్లకు పెంచామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) అభివృద్ధిపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ పదేళ్ల కాలంలో 58వేల కోట్ల నుంచి రెండున్నర లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులను పెంచితే, ఐటీ లో హైదరాబాద్ ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఉపముఖ్యమంత్రి అనడం దురదృష్టకరమన్నారు. భారతదేశంలోని ఐటీ జాబ్ లలో 50 శాతం ఉద్యోగాలు తెలంగాణ నుంచే ఉండడం మనందరికీ గర్వకారణమన్నారు. నాడు 3.25 లక్షల మంది ఉద్యోగుల నుంచి పరిశ్రమల ఏర్పాటు, నూతన ఉపాధి అవకాశాలతో దాదాపు పది లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. ఉప ముఖ్యమంత్రి 40 ఏళ్ల కిందే మూతపడ్డ ఐడిపిఎల్ గురించి మాట్లాడుతున్నారు తప్పా, 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉండి 25 వేల నుంచి లక్ష ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్కాన్ కంపెనీ గురించి మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు.