- పిసీసీ సభ్యుడు అయిళ్ళ శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, జూలై 23 ( అక్షర గళం ) : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ మంగళవారం అన్నారు. బడ్జెట్లో రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. విభజన చట్టం హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. తెదేపా, జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు పెట్టిన బడ్జెట్గా ఉందన్నారు. బిహార్ కు రూ.41వేల కోట్లు ఆర్థిక సాయం.. ఏపీకి రూ.15వేల కోట్లు, పోలవరం పూర్తికి నిధులు కేటాయించి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.
“ఏపీకి కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్నివ్యతిరేకించట్లేదు.. కానీ, తెలంగాణ పట్ల చూపుతున్న
వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ మంత్రుల బృందం గత ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వశాఖలకు నిధులు కేటాయించాలని కోరుతూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఏపీలో పోలవరం నిర్మాణానికి హామీ ఇచ్చిన కేంద్రం.. తెలంగాణలో పాలమూరు
రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎలాంటి హామీఇవ్వలేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం
స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ తదితర అర్హమైన వాటికి నిధులు ఇవ్వలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ
చట్టంలోని హామీలను నెరవేరుస్తామని ఆర్థిక మంత్రిచేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం” అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.