*వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్ గౌడ్
ఆమనగల్లు, నవంబర్ 24 (అక్షర గళం): పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయ బద్దంగా రావాల్సిన వాటా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ బీసీల గొంతుకోసిందని బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్ ఆరోపించారు. సోమవారం పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ… 13 గ్రామ పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ ను ఒక్క గ్రామ పంచాయతీకి కూడా కేటాయించకపోవడం శోచనీయం అన్నారు. బీసీ రిజర్వేషన్ కు బీజేపీ అడ్డుగా ఉందని అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారో అని ప్రశ్నించారు. బీసీలపై కాంగ్రెస్ నాయకులకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే బీసీలకు రిజర్వేషన్ లో జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. బీసీలకు సరైన న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపాలిటీ బీసీ సెల్ అధ్యక్షులు కాడారి పెద్దయ్య యాదవ్, యూత్ ప్రెసిడెంట్ డేరంగుల వెంకటేష్, వరికుప్పల గణేష్, మహేష్ నేత, రేపని శివ, వరికుప్పల నిరంజన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

