- – ప్రభుత్వ భూమి కబ్జా.. ఆపై అప్రోచ్ రోడ్డు
- – ప్రభుత్వ భూమిని అప్రోచ్ రోడ్డుగా చూపించి దొడ్డిదారిన అనుమతులు..?
- – మాస్టర్ ప్లాన్ లో రోడ్డుగా చూపిస్తూ..
- – మేడ్చల్ ట్రాఫిక్ డిసిపి కార్యాలయం కూల్చివేత కు ..
- – స్థానికుల అబ్జెక్షన్ పేరిట..
- – చక్రం తిప్పిన మైస
- – కోర్టును ఆశ్రయించి చర్యలకు స్టే
- – రెండు ఎకరాల విలువైన భూమిని వదులుకున్న పోలీస్ డిపార్ట్మెంట్..?
- – పెట్ బషీరాబాద్ సర్వేనెంబర్ 23 కబ్జాకు లైన్ క్లియర్..?
అక్షరగళం, కుత్బుల్లాపూర్: కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా అప్రోచ్ రోడ్డు గా తప్పుగా చూపించి బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణానికి దొడ్డిదారిన అనుమతులు పొందిన విధానంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా , మల్కాజిగిరి రెవిన్యూ డివిజన్, కుత్బుల్లాపూర్ మండలం, పేట్ బషీరాబాద్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 23 లో ఉన్న రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం పై ఫిర్యాదులు చేస్తున్నారు అక్కడివారు.
ప్రభుత్వ భూమినే అప్రోచ్ రోడ్డుగా..
పెట్ బషీరాబాద్ సర్వేనెంబర్ 23 లో ఐదు ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో కొంత భాగం సెంటెన్స్ పాఠశాలకు కేటాయించగా మరి కొంత భాగం నాలాతోపాటుగా ఇంకొంత భాగంలో కొందరు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఇదే సర్వే నెంబర్ కు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 24, 12 ల వద్ద సర్వేనెంబర్ 23 ప్రభుత్వ భూమి హద్దులు ఉన్నాయి. కాగా సర్వే నంబర్ 24, 12 లను పేర్కొంటూ పద్మ వంశీ ఇన్ఫ్రా డెవలపర్స్, క్యాడల్ డెవలపర్స్ వారు క్యాడెల్ మైస రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ను నిర్మించడానికి ఏకంగా ప్రభుత్వ భూమిని అప్రోచ్ రోడ్డుగా చూపిస్తూ అనుమతులు కొన్ని దాదాపుగా నిర్మాణాన్ని పూర్తి చేశారు.

డీసీపీ కార్యాలయం కూల్చివేత..
అనుమతులు తెచ్చుకున్న తర్వాత కొద్ది కాలానికి క్యాడెల్ మైస వారు అప్రోచ్ రోడ్డుగా చూపించిన భూమిలో మేడ్చల్ ట్రాఫిక్ డిసిపి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు శాఖకు ఈ భూమిని రెవెన్యూ అధికారులు అధికారికంగా కేటాయించడంతో అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 2023 జూన్ ఐదో తారీఖున అప్పటి మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పోలీసు శాఖ ఉన్నతాధికారులు కలిసి వేడుకగా ప్రారంభించారు. అయితే అతి కొద్ది రోజులకే నూతనంగా ప్రారంభించబడిన ట్రాఫిక్ టిసిపి కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. పక్కనే ఉన్న నాలా బఫర్ జోన్ ప్రాంతంలో నిర్మాణం చేయడం జరిగిందని ఒకసారి, అనుమతులు లేకుండా నిర్మించడం జరిగిందని మరొకసారి అందుకే స్వచ్ఛందంగా కూల్చివేస్తున్నామని అప్పటి అధికారులు ప్రకటించారు.

చక్రం తిప్పిన అప్పటి నేతలు..
పైకి అనుమతులు లేవు, బఫర్ జోన్ ప్రాంతంలో నిర్మాణం జరిగింది కాబట్టి కూల్చివేతలు చేపట్టడం జరిగిందని చెప్పినప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉన్న కామారెడ్డికి చెందిన ఓ ముఖ్య నేత కు చెందిన భవనం నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ సహకారంతో ఏకంగా ట్రాఫిక్ డిసిపి కార్యాలయాన్ని నేలమట్టం చేయించడం జరిగిందని ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. ఒకవేళ డిసిపి కార్యాలయాన్ని కూల్చి వహించకపోతే సదరు అపార్ట్మెంట్ నిర్మాణానికి అప్రోచ్లు రోడ్డు లేకుండా పోవడంతో పాటుగా కోట్ల రూపాయల నష్టం వస్తుంది కాబట్టే ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్ని తొలగించే విధంగా చక్రం తిప్పారని చెబుతున్నారు.
లేని రోడ్డు…ఉన్నట్టుగా..
ట్రాఫిక్ డీసీపీ కార్యాలయం కూల్చివేత అనంతరం క్యాడెల్ మైస అపార్ట్మెంట్ వారు ఆ ప్రాంతంలో బీటీ రోడ్డును నిర్మించారు. కొద్ది రోజులకు విమర్శలు రావడంతో అధికారులు అక్కడ భారీ గుంతలను తవ్యారూ. ఇక్కడే సరిగ్గా అపార్ట్మెంట్ నిర్మాణ సంస్థ అక్కడ చాలా రోజుల నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా రోడ్డు ఉన్నదని పేర్కొంటూ చాలా తెలివిగా స్థానికుల పేరిట కోర్టులో పిటిషన్ వేయించి అధికారుల చర్యలకు స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విషయంపై నిజాంపేట్ కార్పొరేషన్ బిజెపి మాజీ అధ్యక్షులు ఆకుల సతీష్ పలుమార్లు స్థానిక రెవిన్యూ అధికారులతో పాటుగా మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ కార్యాలయంలో సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా నవంబర్ 11న ప్రజావాణిలో సైతం ఈ అంశంపై మరో మారు ఫిర్యాదు చేసి కోట్ల రూపాయల విలువచేసే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎందుకు అధికారులు వదులుకుంటున్నారు..? అందుకు కారణమైన అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.


