– కిరాతక హంతకుడికి మరణశిక్ష
అక్షర గళం, సనత్ నగర్ : 2011లో భరత్ నగర్‌లో జరిగిన సంచలనాత్మక హత్య కేసులో నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం.. కత్తితో అత్యంత కిరాతకంగా మహిళను పొడిచి చంపిన కేసులో ఈ చారిత్రక తీర్పు వెలువడింది. ఈ సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌లో జరిగిన ఈ దారుణ హత్య కేసులో నిందితుడైన కరణ్ సింగ్ అలియాస్ కమ్మ సింగ్‌ను దోషిగా తేలుస్తూ, IIIవ అదనపు డిస్ట్రిక్ట్ జడ్జ్ (ఎడీజే) మండా వెంకటేశ్వరరావు సోమవారం తుది తీర్పునిచ్చారు. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ ఘటనలో నిందితుడు కరణ్ సింగ్ ఒక మహిళను హత్య చేసినట్లు విచారణలో తేలింది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరణ్ సింగ్ తమ సమీప బంధువైన అతని సవతి తల్లి కూతురైన మాయ కౌర్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది, వారిద్దరి అక్రమ సంబంధం హత్యకు దారి తీసిందన్నారు. అప్పటి సనత్ నగర్ పీసీ కప్పరి రాము ఫిర్యాదు మేరకు అప్పటి సనత్ నగర్ ఇన్స్పెక్టర్ జి. బస్వా రెడ్డి హత్య కేసు నమోదు చేయగా, ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాస్ రావు దర్యాప్తు నిర్వహించి నిందితుడిపై పటిష్టమైన ఆధారాలతో చార్జిషీటు దాఖలు చేశారు. పద్నాలుగు ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష పడటంతో బాధితురాలి కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం దక్కినట్లైంది. కోర్టు తీర్పుపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) అవినాష్ మొహంతి స్పందించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారుల బృందాన్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను సీపీ అభినందించారు.నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, కూకట్‌పల్లి ఏసీపీ పి. నరేష్ రెడ్డి, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీనివాస్ రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ రావు, సిడిఓ ఎన్. శేఖర్, విచారణ అధికారులను సీపీ మొహంతి ప్రత్యేకంగా అభినందించారు.”కేసు విచారణ, దర్యాప్తులో పోలీసులు చూపిన అంకితభావం, పట్టుదలకు ఈ విజయం నిదర్శనం. ప్రజలకు న్యాయం అందించడంలో పోలీసు వ్యవస్థ నిబద్ధతను ఇది చాటిచెబుతోంది” అని సీపీ పేర్కొన్నారు.

