– సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్
అక్షరగళం, కుత్బుల్లాపూర్: బీసీ రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే కేసులు నమోదు చేయడం సిగ్గుచేటుకరమని సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ తీవ్రంగా విమర్శించారు. సిపిఐ మండల కార్యదర్శి కే. స్వామి, సిపిఎం మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్లు నేడు మేడ్చల్ కోర్టులో హాజరైన నేపథ్యంలో వారు ఆదివారం సంయుక్తంగా ఓ ప్రకటన నువ్వు విడుదల చేశారు. గత నెల 18న రాష్ట్రవ్యాప్తంగా బీసీ బందు పిలుపులో భాగంగా షాపూర్ నగర్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బందును జయప్రదం చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఈ ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దాడులు, విధ్వంసాలు జరగలేదని, పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే కార్యక్రమం కొనసాగిందని, అయినప్పటికీ ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీసీల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒకవైపు బీసీ రిజర్వేషన్లకు మద్దతు ప్రకటిస్తూ, మరోవైపు బీసీ బందు సందర్భంగా ర్యాలీలు నిర్వహించిన వారిపై కేసులు పెట్టడం ఘోరమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ బందు అంశంపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

