
Messi Life Story-మెస్సీ మానియా…ఇంతింత కాదయా..!
ఫుట్‌బాల్ అభిమానుల మనసు దోచుకున్న మెస్సీ
కష్టాలకు ఎదురీది ప్రపంచ స్థాయిలో నిలిచిన ఆటగాడు మెస్సీ
పొట్టివాడైనా గట్టివాడే అని నిరూపించుకున్న మెస్సీ
అనారోగ్యం వెంటాడినా…ఆత్మ విశ్వాసంతో ముందుకుసాగిన మెస్సీ…
నాప్కీన్ కాంట్రాక్ట్…వేలంలో రూ. 8 కోట్లు పలికిన నాప్కీన్…
-Naidi Mahipal Reddy, Senior Journalist

లియోనెల్ మెస్సీ…ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోన్న పేరు. మెస్సీ అని ఫుట్‌బాల్ అభిమానులు కలువరిస్తున్నారు. ఇప్పుడు ఇండియా టూర్‌లో ఉన్న మెస్సీ…హైదరాబాద్‌లోనూ హల్‌చల్ చేశాడు. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అడుగుపెట్టగానే అభిమానులు కేరింతలు అంబరాన్ని అంటాయి.
అసలు ఎవరీ మెస్సీ..? మెస్సీ వెనుక ఉన్న కథ ఏంటీ..? అతని జీవితం ఎక్కడ మొదలయ్యింది…ఇంతలా ఎదగడానికి కారణమేంటి..? అంటూ ఫుట్‌బాల్ అభిమానులే కాదు…సామాన్యులు కూడా ఇంటర్నేట్‌లో మెస్సీ వివరాల కోసం జల్లెడపడుతున్నారు.
చిన్నప్పటి నుంచి మెస్సీ ఎక్కువగా ఎవరితో కలిసేవాడు కాదు. కొత్త వారితో మాట్లాడాలంటే జంకు. పొట్టిగా ఉన్నాననే ఆత్మన్యూనత అతన్ని వెంటాడింది. అయితే ఎప్పటికైనా సాకర్ ఆడాలనేది మెస్సీ ఆశయంగా పెట్టుకున్నాడు. పొట్టివాడు ఏం ఆట ఆడుతాడని అతని సొంత ఊరు రొసారియో కోచ్‌లు ఏడిపించారు.
అయితే మనవడిలోని ప్రత్యేకను ముందుగా మెస్సీ అమ్మమ్మ సెలియా ఒలివేరా గుర్తించింది. అతనిలోని నైపుణ్యాలకు సానాపట్టేందుకు కోచ్‌లను బతిమాలి ఒప్పించింది అమ్మమ్మ సెలియా. 11 ఏళ్ళ వయసులోనే మెస్సీ అమ్మమ్మ చనిపోయినా…అతను ఫుట్‌బాల్‌ను వదల లేదు. ఎంతో ప్రేమించే అమ్మమ్మ కలను నిజం చేసేందుకు మరింత కసిగా ఫుట్‌బాల్ ఆడాడు. ఎన్నో అవహేళనలు, ఎదురుదెబ్బలు ఎదురైనా ప్రపంచ దిగ్గజ సాకర్ ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. అమ్మమ్మకు గుర్తుగా ప్రతి గోల్‌ను రెండు చేతులతో ఆకాశంవైపు చూపుతూ ఆమెకు అంకితం చెయ్యడం మెస్సీ అలవాటు చేసుకున్నాడు. ఇది చూస్తే…మెస్సీ ప్రతీ గోల్ వెనుక అతని అమ్మమ్మ ఆత్మ ఉందేమో అని అనిపిస్తుంది అంటారు అతని అభిమానులు.

వెంటాడిన అనారోగ్యం…
మెస్సీని చిన్నప్పటి నుంచి అనారోగ్యం కూడా వెంటాడింది. 11 ఏళ్ళ వయసులో హార్మోన్ గ్రోత్ డెఫిషియెన్సీ అనే…హార్మోన్ లోపం వచ్చింది. ఖర్చుతో కూడిన వ్యవహారం. అతని కలల ఫుట్‌బాల్ ఆట ఎలా ఆడాలి అనే ప్రశ్న తలెత్తింది. స్పాన్సర్స్ ముఖం చాటేశారు. ఒకవైపు అనారోగ్యం…మరోవైపు ఫుట్‌బాల్ మెస్సీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరికి బార్సిలోనా క్లబ్ అతని చికిత్సకు అయ్యే ఖర్చులు భరించేందుకు ముందకు రావడంతో మెస్సీ బంగారు కల ముందుకు సాగింది అని చెప్పవచ్చు.
అర్జెంటీనా నుంచి బార్సిలోనా…
2000 సంవత్సరంలో మెస్సీ అర్జెంటీనా నుంచి బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌లో అడుగుపెట్టాడు. మెస్సీలోని ఆటగాడు బార్సిలోనా క్లబ్ యాజమాన్యాన్ని మెప్పించినా…ఎక్కడో ఒక చిన్న సందేహం వారిని వెంటాడింది. మెస్సీ ఫుట్‌బాల్ ఆటలో ఎంత వరకు రానించగలడు..? అతడి ఆరోగ్యం ఎంత వరకు సహకరిస్తుంది..? అనే ప్రశ్నలు తలెత్తాయి,
నాప్కీన్ కాంట్రాక్ట్…వేలంలో రూ. 8 కోట్లు పలికిన నాప్కీన్…
అయితే ఇక్కడే బార్సిలోనా క్లబ్ టెక్సికల్ డైరెక్టర్ కార్లస్ రెక్సాచ్…మెస్సీ ఫుట్‌బాల్ కెరీర్లో ప్రధాన పాత్ర పోషించాడు. క్లబ్ యాజమాన్యంతో మాట్లాడి అప్పటికప్పుడే ఒప్పందం కుదిర్చాడు. అగ్రిమెంట్ రాసుకునేందుకు అక్కడ పేపర్ అందుబాటులో లేకపోవడంతో…ఓ న్యాప్‌కిన్‌పై ఒప్పంద పత్రం రాసి మెస్సీ తండ్రి జార్జ్‌తోపాటు రెక్సాచ్ కూడా సంతకాలు చేశారు.
2000 సంవత్సరం చివర…డిసెంబర్ 14న ఈ నాప్కిన్ ఒప్పందాన్ని…ఇది కేవలం కాంట్రాక్ట్ కాదని…నవ శకానికి నాంది…అని సాకర్ పండితులు ఇప్పటికీ అంటుంటారు. ఈ నాప్కిన్‌నను 2024లో వేలం వేస్తే…రూ. 8 కోట్లు పలికింది. ఇదీ మెస్సీ పుట్‌బాల్ ఆటకున్న క్రేజ్‌కు నిదర్శనం.

అందుకే మెస్సీ ఆడుతున్నాడంటే…ప్రపంచ పుట్‌బాల్ అభిమానులు వేలం వెర్రిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ప్రపంచ యాత్రలో ఉన్న మెస్సీ…తనకే కాదు ఫుట్‌బాల్‌కు కూడా మరింత పేరు తెస్తున్నాడనడంలో సందేహం లేదు.


