ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా అబద్దాల ప్రకటనలు

Estimated read time 1 min read

సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాం
సిఎం రేవంత్‌పై హరీష్‌ రావు విమర్శలు
హైదరాబాద్‌,అక్షరగళం:
పాలకపక్షం ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా ముఖ్యమంత్రి సత్య దూరమైన అంశాలను లేవనెత్తుతూ సభను పక్క దారి పట్టిస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ లాబీలో విూడియాతో హరీశ్‌రావు చిట్‌ చాట్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తామని అన్నారు. సభా నాయకుడు ఆదర్శంగా ఉండాల్సింది పొయి సభలో అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.గత సమావేశాల్లో మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్‌ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా మాజీ సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదని అబద్ధమాడారని ధ్వజమెత్తారు. రిటైర్డ్‌ ఇంజినీర్ల వాదన వేరే లాగా ఉంటే సీఎం మరోలా చెప్పి సభను తప్పుదోవ పట్టించారని ఆక్షేపించారు. నిన్నటి సమావేశంలో విద్యుత్‌ విూటర్లపై కూడా తప్పుడు పత్రంతో సీఎం సభను తప్పుదోవ పట్టించారని అన్నారు. తనకు కావాల్సిన వాక్యం చదివి మిగతా పదాలు వదిలేశారని అన్నారు. ఉదయ్‌ స్కీం ఒప్పందం చదివి వ్యవసాయ విూటర్లకు ఒప్పుకున్నట్టు భ్రమింపజేశారని ఏకిపారేశారు. పోతిరెడ్డిపాడుపై దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రారaశేఖర్‌రెడ్డి హయాంలో తాము పదవుల కోసం పెదవులు మూసుకున్నామని రేవంత్‌ తమపై ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడుపై జీఓ రాకముందే తాము వైఎస్‌ కేబినెట్‌ నుంచి వైదొలిగామని స్పష్టం చేశారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్‌ రెడ్డి అనే విమర్శించారు. తానేదో తెలంగాణ ఛాంపియన్‌ అయినట్టు రేవంత్‌ మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే తాము రాజీనామా చేశామని ఉద్ఘాటించారు. సీఎం రేవంత్‌ రెడ్డి కనీసం డూప్లికేట్‌ రాజీనామా కూడా చేయలేదని ఆక్షేపించారు. రేవంత్‌ లాంటి వారు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జరిగాయని చెప్పారు. ఆనాటి అమరుల లేఖలు చూస్తే బలిదానాలకు కారణం ఎవరో తెలుస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌ తెలంగాణ కోసం పని చేయలేదని విమర్శలు చేశారు.ఎల్‌ఆర్‌ఎస్‌ గురించి రేవంత్‌ అప్పుడు ఏం మాట్లాడారు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి , మల్లు భట్టి విక్రమార్క , ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎల్‌ఎర్‌ఎస్‌ ను ఫీజులు లేకుండా చేయాలని ఆనాడు డిమాండ్‌ చేశారని అన్నారు. ఇప్పుడేం చేస్తున్నారని అన్నీ ద్వంద్వ ప్రమాణాలేనని ఆరోపించారు. జైపాల్‌ రెడ్డి తెలంగాణకు ఏ పార్టీనైనా ఒప్పించారా అని నిలదీశారు. రుణ మాఫీపై రేవంత్‌ ది గోబెల్స్‌ ప్రచారం చేశారని దుయ్యబట్టారు. రూ.31 వేల కోట్లు రుణమాఫీకి అవుతుందని రూ.25 వేల కోట్లే బడ్జెట్‌లో పెట్టారని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

You May Also Like

More From Author